పోలీస్ అధికారి ధైర్యసాహసాలు.. వరద నీటిలో చిక్కుకున్న ఆరుగురిని రక్షించిన రాజంపేట ఎస్సై

  • పింఛా జలాశయం గేట్లను ఎత్తిన అధికారులు
  • పశువుల కాపరులను చుట్టుముట్టిన వరదనీరు
  • తాడు సాయంతో నీటిలోకి దిగి రక్షించిన ఎస్సై
కడప జిల్లా రాజంపేటలో వరద నీటిలో చిక్కుకుపోయి ప్రాణభయంతో రక్షించమని వేడుకున్న ఆరుగురిని రాజంపేట ఎస్సై రక్షించారు. అధికారులు నిన్న పింఛా జలాశయం గేట్లను ఎత్తారు. దీంతో బహుదా నదిలోకి వరదనీరు ఉద్ధృతంగా ప్రవహించి పరిసర ప్రాంతాల్లో మేకలు, గొర్రెలను మేపుకుంటున్న కాపరులను చుట్టుముట్టింది. దీంతో భయపడిన కాపరులు తమను రక్షించాలంటూ కేకలు వేశారు.

వారి ఆర్తనాదాలు విన్న కొందరు వెంటనే సుండుపల్లి ఎస్సై భక్తవత్సలానికి సమాచారం అందించారు. సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించారు. తాడు సాయంతో వరదనీటిలోకి దిగి ఆరుగురిని రక్షించి బయటకు తీసుకొచ్చారు. వీరిలో ముగ్గురు మహిళలు కాగా, మిగతా ముగ్గురు పురుషులు. ఎస్సై ధైర్యసాహసాలకు సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి.


More Telugu News