'నాన్న లాగే నేను కూడా ప్రాణం పోయేంత వరకూ మోదీని వదల'నంటున్న చిరాగ్ పాశ్వాన్!

  • వారంలో బీహార్ తొలి దశ ఎన్నికలు
  • ఎన్డీయేను కాదని సొంత అభ్యర్థులను ప్రకటించిన ఎల్జేపీ
  • మోదీపై విశ్వాసాన్ని ప్రకటించిన చిరాగ్
బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కు సమయం దగ్గరవుతున్న సమయంలో బీజేపీ కూటమి గెలుపు కోసం ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగిన వేళ, బీజేపీ కూటమిని, ముఖ్యంగా సీఎం నితీశ్ కుమార్ ను వ్యతిరేకిస్తూ సొంతంగా ఎన్నికల బరిలోకి దిగిన చిరాగ్ పాశ్వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయేలో కొనసాగుతూనే, బీహార్ లో మాత్రం కూటమిని వ్యతిరేకించి, సొంతంగా అభ్యర్థులను ప్రకటించిన ఎల్జేపీ అధినేత, మోదీపై మాత్రం తన విశ్వాసాన్ని ప్రకటించారు. 

"నేను ప్రధాని నరేంద్ర మోదీకి నమ్మినబంటును. నేను అధికారంలోకి రావడానికి నితీశ్ కుమార్ ను జైల్లోకి పంపుతానని చెప్పడం లేదు. ఆయన తీసుకున్న ఏడు ప్రధాన నిర్ణయాల్లో కుంభకోణాలే ఉన్నాయి. వాటిపై విచారణ జరిపిస్తాం. తప్పు చేసిన వారు ఎవరైనా జైలుకు వెళ్లక తప్పదు. అది సీఎం అయినా సరే. తన ఎన్నికల ప్రచారంలో మా నాన్న రాం విలాస్ పాశ్వాన్ కు నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. అందుకు నేను సర్వదా కృతజ్ఞుడను. నా తండ్రి మరణించేంత వరకూ మోదీ తోనే ఉన్నారు. నేను కూడా అంతే. నా తుది శ్వాస విడిచేంతవరకూ మోదీని వదలబోను" అని చిరాగ్ వ్యాఖ్యానించారు. 

కాగా, నిన్న ఉదయం బీహార్ లో ఎన్నికల ప్రచార నిమిత్తం మూడు ర్యాలీలను నిర్వహించి, బహిరంగ సభల్లో పాల్గొన్న మోదీ, తన ప్రచారాన్ని పాశ్వాన్ కు నివాళులు అర్పిస్తూ ప్రారంభించారు. "బీహార్ మాత ఇటీవల తన ఇద్దరు ముద్దు బిడ్డలను కోల్పోయింది. తన జీవితాంతం పేదలు, దళితుల శ్రేయస్సు కోసం పోరాడిన రామ్ విలాస్ పాశ్వాన్, కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ మనల్ని వదిలి వెళ్లిపోయారు" అంటూ తన తొలి ప్రసంగాన్ని ప్రారంభించారు.

అయితే, తన ప్రసంగంలో చిరాగ్ ను మాత్రం మోదీ ప్రస్తావించలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న ఎల్జేపీ, బీహార్ విషయంలో మాత్రం నితీశ్ ను తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. మోదీ తన ప్రసంగంలో చిరాగ్ ను విమర్శిస్తారని, జేడీయూకు పూర్తి మద్దతు ప్రకటిస్తారని ఆ పార్టీ నేతలు భావించినా, మోదీ మాత్రం ఎల్జేపీని విమర్శించక పోవడం గమనార్హం.


More Telugu News