కరోనా నిర్ధారణ కోసం మరో విధానం.. 96 శాతం కచ్చితత్వం కనబరుస్తున్న ఫెలూదా పేపర్ స్ట్రిప్ టెస్ట్

  • ఫెలూదా పేపర్ స్ట్రిప్ టెస్ట్ మార్గదర్శకాలు విడుదల
  • గంటలోపే పూర్తి కచ్చితత్వంతో కూడిన ఫలితం
  • ఖర్చు రూ. 500 లోపే
కరోనా వైరస్ సోకిందీ, లేనిదీ తెలుసుకునేందుకు ఇప్పటికే కొన్ని పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. అయితే, వాటిలో కొన్ని పూర్తి కచ్చితత్వంతో ఫలితాన్ని ఇవ్వడంలేదు. ఇప్పుడు దేశీయంగా మరో విధానం అందుబాటులోకి వచ్చింది. ఇది 96 శాతం కచ్చితత్వంతో ఫలితాలు ఇస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.

ఢిల్లీలోని సీఎస్ఐఆర్‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ, టాటా గ్రూప్ సంయుక్తంగా ఈ సరికొత్త ‘క్రిస్పర్ ఫెలూదా’ విధానాన్ని అభివృద్ధి చేశాయి. ఫెలూదా పేపర్ స్ట్రిప్ పరీక్ష మార్గదర్శకాలను ఐసీఎంఆర్ విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న ఇతర పరీక్షలకంటే మెరుగ్గా, పూర్తి కచ్చితత్వం, వేగవంతమైన ఫలితాన్ని ఇందులో పొందవచ్చని తెలిపింది.

తాజా విధానంలో వైరస్ ఉనికిని గుర్తించేందుకు జీన్ ఎడిటింగ్ సాంకేతికతను ఉపయోగిస్తారు. గర్భ నిర్ధారణకు ఉపయోగించే పట్టీని ఇది పోలి ఉంటుంది. సేకరించిన నమూనాలో వైరస్ ఉంటే ఇది రంగు మారుతుంది. గంటలోపే దీని ద్వారా ఫలితం తెలుసుకోవచ్చని, రూ. 500కు మించి ఖర్చు కాదని అధికారులు తెలిపారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో దీనిని ఉపయోగించేందుకు డీసీజీఐ నుంచి కూడా అనుమతి లభించింది.


More Telugu News