గిట్టుబాటు ధర కోసం రైతుల మహా ధర్నా.. జగిత్యాలలో ఉద్రిక్తత

  • మక్కలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్
  • ధర్నాకు తరలివస్తున్న జీవన్ రెడ్డిని గృహనిర్బంధం చేసిన పోలీసులు
  • రైతు ప్రభుత్వం అంటే ఇదేనా? అని మండిపడిన ఎమ్మెల్సీ
మక్కల (మొక్కజొన్న)కు మద్దతు ధరను డిమాండ్ చేస్తూ జగిత్యాలలో రైతులు తలపెట్టిన మహాధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మొక్కజొన్నకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, సన్న రకాలను రూ. 2,500కు ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నాకు దిగారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు పట్టణంలో 144 సెక్షన్ విధించారు. ధర్నాలు, రాస్తారోకోలకు అనుమతి లేదని, విరమించాలని కోరారు.

అదే సమయంలో ధర్నాలో పాల్గొనేందుకు వస్తున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు. దీంతో పోలీసులు, ప్రభుత్వం తీరుపై ఆయన మండిపడ్డారు. తమది రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను నిండా ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల డిమాండ్లను తక్షణం నెరవేర్చాలని, మక్కలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, సన్న రకాలను కనీసం రూ. 2,500కు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.


More Telugu News