శామ్ కరన్ ఒంటరిపోరాటం... కుప్పకూలే ప్రమాదం తప్పించుకున్న చెన్నై సూపర్ కింగ్స్

  • షార్జాలో ముంబయి వర్సెస్ చెన్నై
  • మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై
  • నిప్పులు చెరిగిన ముంబయి పేసర్లు
  • 20 ఓవర్లలో 9 వికెట్లకు 114 రన్స్ చేసిన చెన్నై
షార్జాలో ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 114 పరుగులు చేసింది. ఓ దశలో 3 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన చెన్నై జట్టు 100 పరుగుల మార్కు దాటిందంటే అందుకు కారణం శామ్ కరన్ పోరాటమే. ఓవైపు వికెట్లు పడుతున్నా మొండిగా పోరాడిన శామ్ కరన్ 47 బంతుల్లో 52 పరుగులు సాధించాడు. అతని స్కోరులో 4 ఫోర్లు, 2 సిక్సులున్నాయి.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి తాత్కాలిక కెప్టెన్ పొలార్డ్ బౌలింగ్ ఎంచుకోగా, బౌల్ట్, బుమ్రా నిప్పులు చెరిగే బౌలింగ్ తో చెన్నై జట్టును కకావికలం చేశారు. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ (0), డుప్లెసిస్ (1), రాయుడు (2), జగదీశన్ (0) పేలవ ఆటతీరుతో వెనుదిరిగారు. కెప్టెన్ ధోనీ (16) పోరాటం కాసేపటికే ముగియడంతో జట్టు భారం యువ శామ్ కరన్ పై పడింది.

ఓవైపు వికెట్ కాపాడుకుంటూనే, అడపాదడపా ఎదురుదాడి చేస్తూ ఇన్నింగ్స్ కొనసాగించాడు. శామ్ కరన్ ఆటవల్లే చెన్నై కుప్పకూలే ప్రమాదం నుంచి తప్పించుకుంది. చివర్లో శార్దూల్ ఠాకూర్ 11, ఇమ్రాన్ తాహిర్  13 పరుగులు సాధించారు. ముంబయి బౌలర్లలో బౌల్ట్ 4, బుమ్రా 2, రాహుల్ చహర్ 2 వికెట్లు తీశారు. కౌల్టర్ నైల్ కు ఓ వికెట్ దక్కింది.


More Telugu News