మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు... డీజీపీని 'అన్నా' అని పిలవడం సరికాదు: రఘురామకృష్ణరాజు

  • తన ప్రసంగంలో డీజీపీని గౌతమ్ సవాంగ్ అన్నా అని పిలిచిన జగన్
  • మీరు మీరు ప్రేమించుకోండి అంటూ రఘురామ వ్యాఖ్యలు
  • పబ్లిక్ లో అలా పిలవొద్దన్న రఘురామ   
ఇటీవల పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం జగన్ తన ప్రసంగంలో డీజీపీని ఉద్దేశించి 'సవాంగ్ అన్నా' అని సంబోధించారు. దీనిపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు.

"నిన్న సీఎం జగన్ గారి అద్భుత వాక్ ప్రవాహంలో భాగంగా డీజీపీని 'గౌతమ్ సవాంగ్ అన్నా' అని సంబోధించారు. మీరు మీరు ప్రేమించుకోండి సార్ తప్పులేదు, కానీ పబ్లిక్ లో 'అన్నా' అని పిలవడం బాగాలేదు. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ విషయాన్ని మీరు మర్చిపోతే ఎలా!" అన్నారు. చాటుగా ప్రేమించుకుంటే ప్రేమించుకున్నారు కానీ ఇలా బహిరంగంగా అన్నా, తమ్ముడూ అనుకోవద్దని సూచించారు.

అంతేకాకుండా, రాజధానిలో ఉద్యమం చేస్తున్న మహిళలను ఉద్దేశించి ఇటీవల జరుగుతున్న ప్రచారంపైనా రఘురామకృష్ణరాజు స్పందించారు. వారు ధరించే చీరలు, జాకెట్ల మీద కామెంట్లు చేస్తున్నారని విమర్శించారు. దుందుడుకుతనంతో మహిళలను అవమానపర్చడం భారతీయ సంస్కృతికి వ్యతిరేకం అని అన్నారు. రాజధాని మహిళలపై తమ పార్టీకి చెందినవారు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తనకు తెలుసని, అయితే ఆ వ్యాఖ్యలు చేసిన వారు తమ పార్టీకి చెందినవారు కాకపోయినా వారిని క్షమించి వదిలేయాలని రాజధాని మహిళలను కోరుతున్నట్టు తెలిపారు.


More Telugu News