ఈ నెల 28న అన్ని రాజకీయ పార్టీలతో ఏపీ ఎన్నికల సంఘం సమావేశం

  • కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడిన స్థానిక ఎన్నికలు
  • ఇప్పుడు స్థానిక ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు
  • సాధారణ ప్రక్రియలో భాగంగానే సమావేశమన్న ఎస్ఈసీ  
సరిగ్గా భారత్ లో కరోనా వ్యాప్తి ఊపందుకున్న సమయంలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం శ్రేయస్కరం కాదన్న ఉద్దేశంతో ఆ ఎన్నికలను వాయిదా వేశారు. ఇప్పుడు కేంద్రం అన్ లాక్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ ఎన్నికల సంఘం దృష్టి సారించింది.

ఈమేరకు అన్ని రాజకీయ పార్టీలతో ఈ నెల 28న ఏపీ ఎన్నికల సంఘం సమావేశం అవుతోంది. స్థానిక ఎన్నికలపై ఈ సమావేశంలో ఆయా పార్టీల అభిప్రాయాలు తెలుసుకోనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఓ ప్రకటన జారీ చేశారు. ఈ సమావేశాన్ని సాధారణ ప్రక్రియలో భాగంగానే నిర్వహిస్తున్నామని, కరోనా జాగ్రత్తలు తీసుకుని సమావేశం నిర్వహిస్తామని రమేశ్ కుమార్ పేర్కొన్నారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఈ సమావేశం ఉంటుందని తెలిపారు.


More Telugu News