తిరుమలలో అరుదైన ఘటన... 30 ఏళ్ల తరువాత వెండి సూర్యుడిపై శ్రీనివాసుడు!

  • శ్రీనివాసునికి ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు
  • ఆలయంలోకి వెళ్లలేకపోయిన సూర్యప్రభ వాహనం
  • పాత వాహనంపై స్వామికి సేవ
నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా, తిరుమల శ్రీనివాసుడికి ఏకాంతంగా వేడుకలు జరుగుతున్న వేళ, దాదాపు మూడు దశాబ్దాల తరువాత వెండి సూర్య భగవానుడి వాహనాన్ని బయటకు తీయాల్సి వచ్చింది. కరోనా కారణంగా అన్ని రకాల స్వామివారి వాహనాలనూ ఆలయంలోకి తీసుకుని వెళ్లి, ఉత్సవ విగ్రహాలను అలంకరించి, ఏకాంతంగా సేవలను జరిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో సూర్య ప్రభ వాహన సేవ నిన్న జరిపించాల్సి వచ్చింది. అయితే, ప్రస్తుతం భక్తులు చూస్తున్న బంగారు సూర్య ప్రభ వాహనం పరిమాణం భారీగా ఉండటంతో, దాన్ని ఆలయంలోకి తీసుకుని వెళ్లే వీలు లేకపోయింది. దీంతో సుమారు 30 సంవత్సరాల క్రితం వరకూ వినియోగించిన వెండి సూర్యదేవుని రథ వాహనంపై సేవను నిర్వహించాల్సి వచ్చింది.

మలయప్పస్వామిని త్రివిక్రమునిగా అలంకరించి, కల్యాణోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకుని వెళ్లిన అర్చకులు, అప్పటికే సిద్ధంగా ఉంచిన వెండి వాహనంపై కొలువుదీర్చి, వేద పారాయణం జరిపి, నైవేద్యాలు సమర్పించారు. రాత్రికి యథావిధిగా చంద్రప్రభ వాహనంపై స్వామిని అలంకరించారు. కాగా, భక్తులు తలా ఓ చెయ్యి వేసి నిర్వహించే రథోత్సవాన్ని ఈ సంవత్సరం రద్దు చేసిన సంగతి తెలిసిందే. నేటితో బ్రహ్మోత్సవాలు ముగియనుండగా, రేపు చక్రస్నానం జరగనుంది.


More Telugu News