అమెరికా చరిత్రలోనే అత్యధిక జరిమానా కట్టేందుకు అంగీకరించిన గోల్డ్ మన్ సాక్స్!

  • దాదాపు రూ. 22 వేల కోట్ల ఫైన్
  • మలేషియా అనుబంధ సంస్థ కుంభకోణం
  • భారీ ఫైన్ విధించిన యూఎస్ కోర్టు
  • చెల్లించేందుకు అంగీకరించిన గోల్డ్ మన్ సాక్స్
ప్రపంచ ఆర్థిక సేవల గోల్డ్ మన్ సాక్స్, అమెరికా చరిత్రలోనే అత్యధిక జరిమానాను చెల్లించేందుకు సిద్ధపడింది. 1 ఎండీబీ మలేషియన్ లంచం కుంభకోణంలో ఇరుక్కున్న సంస్థ 2.9 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 22 వేల కోట్లు) జరిమానాగా చెల్లించనుంది. ఓ అవినీతి కేసులో అమెరికా న్యాయస్థానం విధించిన అత్యధిక ఫైన్ ఇదే కావడం గమనార్హం. జరిమానా చెల్లించేందుకు గోల్డ్ మన్ సాక్స్ అంగీకరించిందని యూఎస్ అసిస్టెంట్ అటార్నీ జనరల్ బ్రియాన్ సీ రాబిట్ స్వయంగా వెల్లడించారు.

కాగా, అమెరికా ఆర్థిక వ్యవస్థను మోసం చేయడం ద్వారా గోల్డ్ మన్ సాక్స్ లబ్ది పొందిందని, ఇందుకోసం 1.6 బిలియన్ డాలర్లను లంచంగా ఇచ్చారని సంస్థపై ఆరోపణలు వచ్చాయి. మలేషియా ప్రభుత్వ సావరిన్ వెల్త్ ఫండ్ 6.5 బిలియన్ డాలర్ల నిధుల సమీకరణకు అక్రమంగా గోల్డ్ మన్ సాక్స్ సహకరించిందని, 1 ఎండీబీ ఉన్నతాధికారులు దాదాపు 4.5 బిలియన్ డాలర్లను దొంగిలించారని, ఈ లావాదేవీలు 2009 నుంచి 2015 మధ్య జరిగాయని అమెరికా కోర్టు నిర్ధారించింది.

ఇన్వెస్ట్ మెంట్ నిధులను కొందరు అవినీతి అధికారులు, వారికి సహకరించిన వారు కలిసి లూటీ చేశారని విచారణలో తేలిందని బ్రియాన్ సీ రాబిట్ మీడియాకు వెల్లడించారు. ఇందులో గోల్డ్ మన్ సాక్స్ మలేషియా యూనిట్ దే ప్రధాన పాత్రని, ఈ విషయాన్ని, జరిగిన తప్పులను సంస్థ న్యాయమూర్తి ముందు అంగీకరించిందని, మరో 9 దేశాల్లోని సంస్థ కార్యాలయాలకూ సంబంధముందని ఆయన తెలిపారు.

కాగా, కోర్టు విచారణలో భాగంగా, తప్పు తమ కారణంగానే జరిగిందని అంగీకరించని గోల్డ్ మన్ సాక్స్ యాజమాన్యం, జరిగిన నష్టానికి పరిహారం చెల్లించేందుకు మాత్రం సిద్ధపడింది. మొత్తం మూడున్నర సంవత్సరాల్లో నియంత్రణా సంస్థలను మాయచేస్తూ, లావాదేవీలు జరిగాయని, అందుకు మొత్తం సంస్థను బాధ్యత చేయడం తగదని కోర్టు ముందు వేడుకుంది. ఈ మొత్తం కుంభకోణం సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్ లు టిమ్ లెస్నర్ (దక్షిణాసియా గోల్డ్ మన్ సాక్స్ మాజీ చైర్మన్), ఎన్జీ చాంగ్ హ్వా (గోల్డ్ మన్ సాక్స్ మలేషియా మాజీ హెడ్)ల నాయకత్వంలో జరిగిందని, మరికొందరు ఉద్యోగులు కూడా వారికి సహకరించారని రాబిట్ వెల్లడించారు.


More Telugu News