పది రోజుల్లోనే శశికళకు జైలు జీవితం నుంచి విముక్తి!

  • కట్టాల్సిన జరిమానా డబ్బును సిద్ధం చేశాం
  • శశికళ నుంచి లేఖ అందిందన్న న్యాయవాది పాండియన్
  • 129 రోజుల శిక్షాకాలం తగ్గాల్సి వుందని వెల్లడి
మరొక్క పది రోజుల్లో శశికళ జైలు జీవితం నుంచి విముక్తిని పొంది బయటకు రానున్నారని ఆమె తరఫున పలు కేసులను వాదించిన లాయర్ రాజా చెందూర్‌ పాండియన్‌ ధీమా వ్యక్తం చేశారు. జైలు నుంచి బయటకు రావాలంటే కట్టాల్సిన జరిమానా మొత్తం రూ.10 కోట్ల పదివేలును సిద్ధం చేశామని ఆయన అన్నారు. శశికళ నుంచి ఆదివారం నాడు తనకు ఓ లేఖ అందిందని చెప్పిన ఆయన, లేఖలోని అంశాల ఆధారంగానే ఆమె విడుదలపై ఓ అంచనాకు వస్తున్నామని అన్నారు.

కాగా, జయలలిత అక్రమాస్తుల కేసులో శిక్ష ముగించుకుని జనవరిలో శశికళ విడుదల కానున్నారని ఇప్పటికే సంకేతాలు వెలుడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రాజా చెందూర్ పాండియన్, కర్ణాటక జైళ్ల నిబంధనల మేరకు శిక్షను అనుభవిస్తున్న వారికి నెలలో 3 రోజులు సత్ప్రవర్తన పరిధి ఉంటుందని, ఈ లెక్కల ప్రకారం శశికళకు 129 రోజుల శిక్షా కాలం తగ్గాల్సి వుందని తెలిపారు. ఆమె ఇప్పటికే 43 నెలలకు పైగా జైలు జీవితాన్ని అనుభవించారని, మరో పది రోజుల్లో ఆమె బయటకు వస్తారని అన్నారు.

కాగా, ప్రస్తుతం కర్ణాటకలో కోర్టులకు దసరా సెలవులు నడుస్తున్నాయి. మళ్లీ 26న కోర్టులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆ వెంటనే శశికళ విడుదలపై ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మంగళవారం లేదా బుధవారం శుభవార్త తెలుస్తుందని పాండియన్ తెలిపారు.


More Telugu News