2021 జనవరి 1 నుంచి రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే: సీఎం జగన్

  • 2023 నాటికి పూర్తవుతుందని వెల్లడి
  • 100 ఏళ్ల తర్వాత రీసర్వే జరగనుందన్న సీఎం జగన్
  • పక్కాగా డిజిటలైజ్ చేస్తామని వివరణ
రాష్ట్రంలో సమగ్ర భూసర్వే నిర్వహించనున్నామని ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. 2021 జనవరి 1 నుంచి ఏపీ వ్యాప్తంగా భూసర్వే జరగాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 100 ఏళ్ల తర్వాత రీసర్వే ద్వారా పక్కాగా భూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ జరగనుందని అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తొలిసారి భూముల సమగ్ర సర్వే చేయనున్నట్టు వివరించారు.

త్వరలోనే గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉందని తెలిపారు. రిజిస్ట్రేషన్లకు ఏర్పాట్లు చేయాలని సర్వేయర్లకు ఆదేశాలు జారీ చేశారు. రికార్డులు తారుమారు కాకుండా డిజిటలైజేషన్ ప్రక్రియ పటిష్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో 1.22 లక్షల చదరపు కిలోమీటర్లలో భూముల సమగ్ర సర్వే జరుగుతుందని అన్నారు. మూడు దశల్లో 2023 నాటికి భూముల రీసర్వే ప్రక్రియ పూర్తవుతుందని సీఎం జగన్ వెల్లడించారు. రీసర్వే కోసం ఉపగ్రహ ఛాయాచిత్రాలు వినియోగించుకుంటామని చెప్పారు. వివాదాల పరిష్కారం కోసం గ్రామాల్లో మొబైల్ కోర్టుల ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.


More Telugu News