దీక్షిత్ కిడ్నాపర్ ను ఎన్‌కౌంటర్ చేశారంటూ వదంతులు.. అదేం లేదంటున్న ఎస్పీ!

  • దానవయ్య గుట్టల్లో బాలుడి మృతదేహం లభ్యం 
  • పలువురు నిందితులను ఎన్ కౌంటర్ చేశారని వదంతులు
  • తాము ఎన్ కౌంటర్ చేయలేదని ఎస్పీ కోటిరెడ్డి స్పష్టత
  • మరో నిందితుడు మనోజ్ కూడా పోలీసుల అదుపులో 
మహబూబాబాద్ జిల్లాలో నాలుగు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన బాలుడు దీక్షిత్ రెడ్డి(9)ని మందసాగర్ అనే మెకానిక్ కిడ్నాప్ చేసి, హ‌త్య చేశాడని పోలీసులు వివరించిన విషయం తెలిసిందే. మరోపక్క, దానవయ్య గుట్టల్లో బాలుడి మృతదేహం లభ్యం కావడంతో ఈ ఘటనపై సమీపంలోని స్థానికులు మండిపడుతున్నారు.

ఆ బాలుడిని చంపిన నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, మరోపక్క, నిందితులను పోలీసులు ఇప్పటికే ఎన్ కౌంటర్ చేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ కేసులో పలువురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారా? అంటూ ఈ రోజు ఎస్పీ కోటిరెడ్డిని మీడియా సమావేశంలో విలేకరులు ప్రశ్నించారు.

దీనికి ఎస్పీ సమాధానం చెబుతూ... ఆ వార్తల్లో నిజం లేదని, తాము ఎన్ కౌంటర్ చేయలేదని స్పష్టతనిచ్చారు. అలాగే, ఆ బాలుడిని మందసాగర్ ఒక్కడే గొంతునులిమి చంపేశాడని తాము ప్రాథమిక నిర్ధారణకు వచ్చామని చెప్పారు. ఈ కేసులో తాము ఇప్పటివరకు 30 మందిని విచారించామని తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడిగా అనుమానిస్తోన్న మనోజ్ రెడ్డి అనే వ్యక్తి కూడా ప్రస్తుతం తమ అదుపులోనే ఉన్నాడని తెలిపారు.


More Telugu News