దీక్షిత్‌ను కిడ్నాప్ చేసిన గంటన్నరలోనే గొంతునులిమి చంపేశాడు: పూర్తి వివరాలు తెలిపిన ఎస్పీ

  • మెకానిక్ మందసాగర్ బాలుడిని హత్య చేశాడు
  • మందసాగర్ ఆ కుటుంబానికి తెలిసిన వ్యక్తే
  • తొందరగా డబ్బులు సంపాదించాలన్న దురాశతో కిడ్నాప్‌
  • బైక్‌‌కు ఫేక్‌ నంబరు తగిలించి బాలుడి కిడ్నాప్  
మహబూబాబాద్‌లోని కృష్ణ కాలనీలో అపహరణకు గురైన దీక్షిత్ రెడ్డి (9)ని కిడ్నాపర్లు హత్య చేసిన ఘటనపై ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో రంజిత్ రెడ్డి పెద్దకుమారుడు దీక్షిత్ (9) ను కిడ్నాప్ చేశారని చెప్పారు. మెకానిక్ మందసాగర్ అనే వ్యక్తి బాలుడిని హత్య చేశాడని వివరించారు.

ఆ బాలుడికి తొమ్మిదేళ్లు ఉంటాయని, నాలుగో తరగతి చదువుతున్నాడని చెప్పారు. తొందరగా డబ్బులు సంపాదించాలన్న దురాశతో ఈ కిడ్నాప్‌ చేశాడని వివరించారు. కిడ్నాపర్ తెలిసిన వ్యక్తి కావడం వల్లే బాలుడు పిలవగానే వెళ్లాడని, ముందస్తు ప్రణాళిక ప్రకారం సీసీ కెమెరాలు లేని ప్రాంతాల నుంచే బాలుడిని తీసుకెళ్లాడని తెలిపారు.

దానవయ్య గుట్టకు బాలుడిని తీసుకెళ్లిన మందసాగర్‌కు అతడిని అక్కడ ఉంచడం కష్టంగా మారిందని, దీంతో తనకు పోలీసుల నుంచి ఇబ్బందులు తప్పవని భావించి, వదిలేసినా బాలుడు తన వివరాలు బయటపెడతాడని భావించి, అతడిని కిడ్నాప్ చేసిన గంట, గంటన్నరలోనే బాలుడిని గొంతునులిమి చంపేశాడని వివరించారు.

తమకు ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం అతడు ఒక్కడే బాలుడి ఇంటి సమీపంలోకి వచ్చి దీక్షిత్ ను తీసుకెళ్లాడని తెలిపారు. మంద సాగర్ కు ఓ బైక్‌ ఉందని, దానికి ఫేక్‌ నంబరు తగిలించి బాలుడిని కిడ్నాప్ చేశాడని కోటిరెడ్డి తెలిపారు.

కిడ్నాప్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా ఒకటి తమకు లభించిందని వివరించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు మహబూబాబాద్ శివారులోని గుట్టలపైకి బాలుడిని తీసుకెళ్లాడని తెలిపారు. ఆ తర్వాత బాలుడిని విడిచి పెట్టేందుకు రూ.45 లక్షలు డిమాండ్ చేశాడని వివరించారు.

బాలుడిని చంపేసిన రెండు రోజుల తర్వాత కూడా డబ్బు కోసం ఫోన్లు చేస్తూనే ఉన్నాడని తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ జరుపుతున్నామని సాయంత్రంలోపు పూర్తి స్పష్టత వస్తుందని కోటిరెడ్డి అన్నారు. ఈ కేసులో ఇతర నిందితుల గురించి కూడా స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. సాంకేతికత సాయంతోనే తాము నిందితుడిని పట్టుకుననమని చెప్పారు. నిందితుడు ఇంటర్నెట్ కాల్స్ చేసినప్పటికీ తాము హైదరాబాద్ సైబర్ క్రైమ్ టాస్క్ ఫోర్స్ సాయంతో పట్టుకున్నామని చెప్పారు. రేపు ఉదయంలోగా పూర్తి వివరాలను మరోసారి వెల్లడిస్తామని తెలిపారు.


More Telugu News