ఏపీలో భారీగా పెరిగిన వాహన జరిమానాలు... నిబంధనలు ఉల్లంఘిస్తే మోత మోగుద్ది మరి!

  • కేంద్ర చట్టానికి అనుగుణంగా జరినామాలు పెంచిన ఏపీ
  • రెండు కేటగిరీల్లో జరిమానాలు
  • బైక్ ల నుంచి నాలుగు చక్రాల వాహనాలన్నీ ఒకే కేటగిరీ
  • మరో కేటగిరీలో భారీ వాహనాలు
కేంద్రం సవరించిన మోటారు వాహనాల చట్టానికి అనుగుణంగా ఏపీలోనూ మోటారు వాహనాల నిబంధనలను మరింత కఠినతరం చేయడమే కాకుండా, జరిమానాలు కూడా భారీగా పెంచారు. 1988 నాటి మోటారు వాహనాల చట్టానికి కేంద్రం అనేక సవరణలు చేసి 2019లో గెజిట్ విడుదల చేసిందని ఏపీ సర్కారు ఓ ప్రకటనలో పేర్కొంది. ఆ గెజిట్ ను కూలంకషంగా పరిశీలించిన పిమ్మట, ఏపీలో మోటారు వాహనాల నిబంధనలు ఉల్లంఘించినవారిపై భారీగా జరిమానాలు విధించాలని నిర్ణయించినట్టు వెల్లడించింది.

కాగా, ఈ జరిమానాలను రెండు విభాగాలుగా విభజించారు. ఒక కేటగిరీలో ద్విచక్రవాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు ఉంటాయి. మరో కేటగిరీలో భారీ వాహనాలు ఉంటాయి.

ముఖ్యాంశాలు ఇవే..

  • బైక్ ల నుంచి 7 సీట్ల కార్ల వరకు ఒకే జరిమానా.
  • ఎక్కువసార్లు నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు.
  • సెల్ ఫోన్ డ్రైవింగ్ కు 10 వేల ఫైన్. ప్రమాదకర రీతిలో డ్రైవింగ్ చేసినా ఇదే జరిమానా.
  • రేసింగ్ లో మొదటిసారి దొరికిపోతే రూ.5,000 జరిమానా, రెండోసారి కూడా పట్టుబడితే రూ.10,000 ఫైన్.
  • వాహనాల బరువు చెకింగ్ కోసం ఆపినప్పుడు వాహనదారుడు ఆపకుండా వెళితే రూ.40,000 జరిమానా.
  • ఓవర్ లోడ్ తో వెళితే రూ.20,000 ఫైన్, పరిమితికి మించి ఎన్ని టన్నులు ఉంటే ఒక్కో టన్నుకు రూ.2,000 అదనం.
  • వాహనాల చెకింగ్ కు అడ్డుతగిలినా, వివరాలు, సమాచారం ఇచ్చేందుకు నిరాకరించినా రూ.750 వడ్డన.
  • నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే రూ.5,000 ఫైన్.
  • నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే తయారీసంస్థలకు, డీలర్లకు మాత్రమే కాకుండా విక్రయదారులకు కూడా రూ.1,00,000 జరిమానా.
  • అనుమతి లేని వ్యక్తులకు వాహనం ఇచ్చినా, అర్హత కంటే తక్కువ వయసున్న వారికి వాహనం ఇచ్చినా రూ.5,000 ఫైన్.
  • డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హతలేని వారికి వాహనం ఇస్తే రూ.10,000 జరిమానా
  • అవసరం లేకపోయినా హారన్ మోగిస్తే మొదటిసారి రూ.1,000, రెండోసారి రూ.2,000 ఫైన్.
  • ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ.10,000 ఫైన్.
  • పర్మిట్ లేని వాహనాలు నడిపితే రూ.10,000 జరిమానా.





More Telugu News