మూసీ నదికి శాంతి పూజలు చేసిన తెలంగాణ సర్కారు

  • భారీవర్షాలకు ఉగ్రరూపం దాల్చిన మూసీ
  • శాంతించాలంటూ ప్రత్యేక పూజలు
  • గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు  
హైదరాబాద్ నగరంలో మూసీ నది మహోగ్రరూపం దాల్చి అనేక ప్రాంతాలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలకు మూసీ నది పోటెత్తింది. దాంతో నగరంలోని మూసీ పరీవాహక ప్రాంతం వరద గుప్పిట్లో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో మూసీ నది శాంతించాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పురానాపూల్ వద్ద మూసీ నదికి శాంతి పూజలు చేశారు.

గంగమ్మ తల్లికి బోనం సమర్పించడంతో పాటు పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, పూలు నివేదించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, 1908లోనూ భారీ వరదలు సంభవించడంతో నాటి నిజాం పాలకుడు మీర్ మహబూబ్ అలీఖాన్ కూడా మూసీ నదికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మూసీ నదికి అంతటిస్థాయిలో భారీ వరదలు రావడం మళ్లీ ఇదే ప్రథమం.


More Telugu News