బీహార్ పీఠం దక్కేది ఎవరికి?.. లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ సర్వే వివరాలు!

  • బీజేపీ కూటమికి 133 నుంచి 143 సీట్లు
  • కాంగ్రెస్ - ఆర్జేడీకి 88 నుంచి 98 స్థానాలు
  • గరిష్ఠంగా 6 స్థానాలకు ఎల్జేపీ పరిమితం
త్వరలో బీహార్ కు జరగనున్న ఎన్నికల్లో జనతాదళ్ యునైటెడ్ - బీజేపీ కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని లోక్ నీతి, సీఎస్డీఎస్ సర్వే అంచనా వేసింది. మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో జేడీయూ - బీజేపీ కూటమికి 133 నుంచి 143 స్థానాలు రావచ్చని, కాంగ్రెస్ - ఆర్జేడీ కూటమికి 88 నుంచి 98 స్థానాల వరకూ దక్కుతాయని తమ సర్వేలో వెల్లడైనట్టు పేర్కొంది.

ఇక ఎన్డీయే నుంచి బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టుకున్న రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీకి కేవలం 2 నుంచి 6 స్థానాలు మాత్రమే దక్కుతాయని వెల్లడించింది. ఇతరులు మరో 10 స్థానాల వరకూ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపింది. ఎన్డీయేకు 38 శాతం ఓట్లు, మహా కూటమికి 32 శాతం ఓట్లు లభించే అవకాశాలు ఉన్నాయని, ఎల్జేపీకి 6 శాతం ఓట్లు రావచ్చని లోక్ నీతి -సీఎస్డీఎస్ ఒపీనియన్ పోల్ ఫలితాల్లో వెల్లడైంది.

కాగా, బీహార్ అసెంబ్లీకి 3 విడతల్లో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. తొలివిడత ఎన్నికలు ఈ నెల 28న, నవంబర్ 3న రెండో విడత, 7న మూడో విడత ఎన్నికలు జరుగనుండగా, 10వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. తొలి, రెండో విడత ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తికాగా, అభ్యర్థులంతా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు.


More Telugu News