తొలి దశలో 3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ యోధులకు టీకా: కేంద్ర ఆరోగ్య శాఖ

  • 70 లక్షల మంది డాక్టర్లకు టీకా
  • ఆపై 2 కోట్ల మంది హెల్త్ వర్కర్లకు
  • జనవరి నుంచి జూన్ మధ్య పంపిణీ
  • వెల్లడించిన ఆరోగ్య శాఖ కార్యదర్శి
వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే, కరోనాపై పోరాటంలో ముందు నిలిచిన 3 కోట్ల మందికి తొలుత ఇవ్వాలని నిర్ణయించామని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు. ఈ మూడు కోట్ల మందిలో 70 లక్షల మంది వైద్యులు ఉంటారని, మరో 2 కోట్ల మంది వరకూ హెల్త్ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు ఉంటారని ఆయన స్పష్టం చేశారు. వ్యాక్సిన్ సిద్ధమైన తరువాత సాధ్యమైనంత త్వరలోనే 3 కోట్ల డోస్ లు రెడీ అవుతాయని, అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఇప్పటికే సిద్ధం చేశామని ఆయన తెలిపారు. కోల్డ్ చైన్, వయల్స్, సిరంజ్ తదితరాలన్నీ రెడీగా ఉన్నాయన్నారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, ఇండియాలో తొలి దశ వ్యాక్సినేషన్ జనవరి నుంచి జూన్ మధ్య జరుగుతుందని అంచనా వేస్తున్నట్టు వెల్లడించిన ఆయన, ఈ విషయంలో జాతీయ నిపుణుల కమిటీ ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ నిర్వహణ కార్యక్రమాన్ని సమీక్షిస్తుందని, ఇప్పటికే ముసాయిదా ప్రాధాన్యతాక్రమ ప్రణాళిక తయారైందని అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ట్రయల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు జనవరి నాటికి వ్యాక్సిన్ వస్తుందన్న నమ్మకం ఉందని రాజేశ్ భూషణ్ తెలిపారు.

తొలుత వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలో జాబితాను అందించాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలనూ కోరామని, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా వైరస్ సోకకుండా ఉండేందుకు ఇప్పుడు తీసుకుంటున్న జాగ్రత్తలనే తీసుకోవాల్సి వుంటుందని, వ్యాక్సిన్ ప్రజలందరికీ ఇస్తూ వెళుతుంటే, కరోనా కేసుల టెస్టింగ్, ట్రీట్ మెంట్, ఐసోలేషన్ తగ్గిపోతుందని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) చీఫ్ డాక్టర్ బలరామ్ బార్గవ తెలియజేశారు.


More Telugu News