బీహార్ ఎన్నికల్లో పోటీపడుతున్నవారిలో 31 శాతం మంది క్రిమినల్సే!

  • ఎన్నికల్లో 1,064 మంది పోటీ
  • 328 మందిపై క్రిమినల్ కేసులు
  • ఆర్జేడీ వారే అధికం
బీహార్ ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 31 శాతం మంది నేరగాళ్లే. మూడు విడతలుగా జరగనున్న ఈ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన మొత్తం 1,064 మంది పోటీపడుతున్నారు. వీరిలో 31 శాతం మంది అంటే 328 మందిపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. వీరిలో 56 మందిపై తీవ్ర అభియోగాలు ఉన్నాయి. నాన్‌బెయిలబుల్ కేసులు ఎదుర్కొంటున్న వీరికి నేరాలు రుజువైతే కనీసం ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) ఈ నివేదికను విడుదల చేసింది.

క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారిలో అత్యధికశాతం లాలుప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ అభ్యర్థులే కావడం గమనార్హం. మొత్తం అభ్యర్థుల్లో 29 మందిపై మహిళలపై వేధింపుల కేసులు నమోదు కాగా, ముగ్గురు అత్యాచారం కేసులు ఎదుర్కొంటున్నారు. 21 మందిపై హత్యానేరం కేసులు, 62 మందిపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. అభ్యర్థుల ఎంపికలో పార్టీలు అవలంబించిన తీరును బట్టి ఎన్నికల్లో సంస్కరణలకు ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.


More Telugu News