హైదరాబాద్‌ను వెంటాడుతున్న వర్షం.. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి

  • నగరంలో ఎడతెరిపి లేని వానలు
  • ఇంకా ముంపులోనే 200 కాలనీలు
  • కూలుతున్న పురాతన ఇళ్లు
  • విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి
ఎడతెరిపి లేని వానలు హైదరాబాద్ వాసులను బెంబేలెత్తిస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో నిన్న నగరంలో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో మూడు రోజులపాటు పరిస్థితి ఇలాగే ఉంటుందన్న అధికారుల హెచ్చరికలు లోతట్టు ప్రాంతాల ప్రజలను మరింత భయపెడుతున్నాయి. ఇక, ఇటీవల కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి. దాదాపు 200 కాలనీల్లోని ప్రజలు వరద నీరు చుట్టుముట్టడంతో బయటకు అడుగుపెట్టలేక అల్లాడిపోతున్నారు. వారం రోజులుగా ఆహారం, తాగు నీరు అందక విలవిల్లాడుతున్నారు.

పాతబస్తీలోనూ పరిస్థితిలో ఏమాత్రం మార్పులేదు. దూద్‌బౌలి, ఖబూతర్‌ఖానా, హుస్సేనీ ఆలం, పురానాపూల్ ప్రాంతాల్లో డ్రైనేజీ నీరుకు వరదనీరు తోడవడంతో వీధులు కంపుకొడుతున్నాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చెరువుల సమీపాల్లో నివసించే వారు తక్షణం ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరుతున్నారు.

గత కొన్ని రోజులుగా తెరిపివ్వకుండా కురుస్తున్న వానలకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పురాతన భవనాలు కుప్పకూలుతున్నాయి. చార్మినార్ సమీపంలో ఒకటి, గౌలిపురా సాయిబాబా దేవాలయం సమీపంలో మరో ఇల్లు కుప్పకూలాయి. అయితే, ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పాతబస్తీలో ప్రమాదకరంగా ఉన్న 15 ఇళ్లను గుర్తించిన అధికారులు నోటీసులు జారీ చేయగా, అందులో 8 ఇళ్లను కూల్చివేశారు. రహమత్‌నగర్‌లో సెల్లార్‌లోకి చేరిన వరద నీటిని బయటకు పంపే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు మరణించాడు.


More Telugu News