కొడుకు బహుమతిగా ఇచ్చిన యాపిల్ వాచ్ వృద్ధుడి ప్రాణాలు కాపాడింది!

  • రాజన్ అనే వృద్ధుడికి ఆపిల్ వాచ్ బహూకరించిన తనయుడు సిద్ధార్థ్
  • రాజన్ హార్ట్ బీట్ లో తేడా పసిగట్టిన యాపిల్ వాచ్
  • డాక్టర్ కు ఈసీజీ రిపోర్టులు పంపి లోపాన్ని తెలుసుకున్న వృద్ధుడు
  • ఆపరేషన్ తో వృద్ధుడికి తప్పిన ముప్పు
ఇవాళ టెక్నాలజీతో ఒనగూరుతున్న ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అరచేతిలో ప్రపంచం సాక్షాత్కారం అవుతోంది. అన్ని పనులు మొబైల్ ఫోన్ తో నిర్వర్తించుకోగలిగేంతగా సాంకేతిక పరిజ్ఞానం నేడు అందుబాటులో ఉంది. ఇక వినూత్న ఆవిష్కరణ అనదగ్గ స్మార్ట్ వాచ్ లు తమ ప్రాధాన్యత చాటుకుంటున్నాయి. తాజాగా యాపిల్ స్మార్ట్ వాచ్ ఓ వృద్ధుడి ప్రాణాలు కాపాడిన ఘనత మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది.

ఇండోర్ కు చెందిన రాజన్ అనే వృద్ధుడు గతంలో ఫార్మా రంగంలో పనిచేసి పదవీ విరమణ చేశారు. రాజన్ కు కుమారుడు సిద్ధార్థ్ ఓ యాపిల్ వాచ్ ను బహూకరించాడు. అది సిరీస్ 5 శ్రేణిలోని స్మార్ట్ వాచ్. ఇటీవల రాజన్ అనారోగ్యం పాలయ్యారు. దాంతో యాపిల్ వాచ్ లో ఉండే ఈసీజీ ఫీచర్ తో తన హృదయస్పందన వేగాన్ని తెలుసుకుని ఆ రిపోర్టును తన ఫ్యామిలీ డాక్టర్ కు పంపారు. హార్ట్ బీట్ బాగానే ఉందని, అయితే రాజన్ కు అధిక రక్తపోటు ఉందని ఆ డాక్టర్ తెలిపారు.

మరికొన్ని రోజులకు రాజన్ తన హృదయ స్పందనలో తేడాలు గమనించారు. మరోసారి యాపిల్ వాచ్ సాయంతో ఈసీజీ తీసి డాక్టర్ కు పంపించారు. ఈసారి రాజన్ హృదయ స్పందన తక్కువ వేగంతో ఉన్నట్టు గుర్తించిన డాక్టర్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా ఆపరేషన్ చేసే పరిస్థితులు లేకపోవడంతో రాజన్ ప్రతిరోజు తన యాపిల్ వాచ్ తో ఈసీజీ తీసి డాక్టర్ కు పంపిస్తుండేవాడు. వాటి ద్వారా రాజన్ ఆరోగ్యాన్ని గమనిస్తూ ఆ డాక్టర్ తగిన సూచనలు ఇస్తుండేవారు.

ఆ తర్వాత రాజన్ కు గుండె ఆపరేషన్ చేసి లోపాన్ని సరిదిద్దారు. ప్రస్తుతం ఆయన కోలుకుని మామూలు మనిషయ్యారు. మొత్తానికి యాపిల్ వాచ్ తో ఆ వృద్ధుడి గుండెలో ఉన్న లోపం వెల్లడైంది. ఇదే విషయాన్ని రాజన్ కుమారుడు సిద్ధార్థ్ యాపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్ కు తెలియజేశారు. దీనిపై స్పందించిన టిమ్ కుక్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. రాజన్ సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశం పంపారు.


More Telugu News