దసరా పండుగకు తెలంగాణ నుంచి ఆర్టీసీ బస్సులు నడపలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమే: నాదెండ్ల మనోహర్

  • ఏపీ, తెలంగాణ మధ్య నిలిచిన ఆర్టీసీ సర్వీసులు
  • ప్రజలు పండుగ కోసం సొంతూళ్లకు ఎలా రావాలన్న నాదెండ్ల
  • రెండు రాష్ట్రాలు సమస్యను పరిష్కరించాలని సూచన
ఇటీవల ఎన్నో దఫాలుగా చర్చలు జరిపినా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు తిప్పేందుకు తెలంగాణ, ఏపీ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నేపథ్యంలో, పండుగ సీజన్ వచ్చేసిందని, తెలంగాణ నుంచి ఆర్టీసీకి దసరా సందర్భంగా బస్సులు నడపలేకపోవడం కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని జనసేన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నాదెండ్ల మనోహర్ విమర్శించారు. తెలంగాణ ప్రాంతం నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావాలనుకునే ప్రయాణికులు ఆర్టీసీ బస్సులు లేనందున తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.

దసరా నాటికైనా బస్సులు తిరుగుతాయని ఆశించి, పండుగకు సొంత ఊళ్లకు వెళ్లాలనుకున్న వారికి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి నిరాశ కలిగించిందని పేర్కొన్నారు. అదే విధంగా వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లాలనుకున్నవారికి రవాణా సదుపాయం లేకుండా పోయిందని వివరించారు. అయితే, తమకు కావాల్సిన వారికి అత్యవసర పరిస్థితి ఏర్పడితే ప్రత్యేక హెలికాప్టర్లు ఏర్పాటు చేసి హైదరాబాద్ తరలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పేదల కోసం బస్సులు నడపలేకపోతోందని విమర్శించారు. 'కిలోమీటర్ల లెక్క కుదరలేదు కాబట్టి బస్సులు తిప్పలేకపోతున్నాం' అనేది సంతృప్తికరమైన సమాధానం కాదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని హితవు పలికారు.

ప్రజలు ప్రైవేటు ట్రావెల్స్ లో వెళ్లాలనుకున్నా టికెట్ ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారని, ట్రావెల్స్ ను నియంత్రించే యంత్రాంగం కూడా లేదని తెలిపారు. ఏపీ సర్కారు ప్రజా రవాణా అంశంపై తక్షణమే ప్రత్యేక దృష్టి చూపకపోతే సంక్రాంతికి కూడా సమస్య పరిష్కారం కాదని స్పష్టం చేశారు. ప్రజల ప్రయోజనాలే పరమావధిగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు భేషజాలకు పోకుండా సానుకూలంగా సమస్యను సత్వరమే పరిష్కరించుకోవాలని నాదెండ్ల మనోహర్ సూచించారు.


More Telugu News