సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ

  • సాయంత్రం 6 గంటలకు మోదీ ప్రసంగం
  • ఒక సందేశాన్ని అందరితో పంచుకుంటానన్న ప్రధాని
  • కరోనాపైనే మాట్లాడతారంటూ ఊహాగానాలు
ప్రధాని మోదీ ఈరోజు సాయంత్రం 6 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఒక సందేశాన్ని అందరితో పంచుకుంటానని ఆయన తెలిపారు. అయితే ఏ విషయంపై మాట్లాడాలనుకుంటున్నారనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. దీంతో ప్రధాని ప్రకటనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కరోనా పరిస్థితిపైనే ప్రధాని మాట్లాడవచ్చని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 మార్చి నెలలో లాక్ డౌన్ విధించిన అనంతరం జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించనుండటం ఇది  ఏడోసారి కావడం గమనార్హం. జూన్ నుంచి విడతల వారీగా లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తున్నారు.

మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య 76 లక్షలకు చేరుకుంది. అయితే గత 24 గంటల్లో కొత్తగా 46,790 కేసులు మాత్రమే నమోదయ్యాయి. గత మూడు నెలల కాలంలో ఒక రోజులో నమోదైన కేసుల సంఖ్య 50 వేల దిగువకు రావడం ఇదే  తొలిసారి. ఇంకోవైపు ఇది పండుగల సీజన్ కావడంతో... కరోనా కేసులు అమాంతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోదీ ఈ సాయంత్రం కరోనాపైనే మాట్లాడొచ్చని భావిస్తున్నారు.


More Telugu News