దసరా కానుక... బాలకృష్ణ దర్శకత్వం వహించిన 'నర్తనశాల' చిత్రంలోని కొన్ని సన్నివేశాల విడుదల

  • శ్రేయాస్ ఈటీ ఓటీటీ వేదికపై రిలీజ్
  • ఈ నెల 24న అభిమానుల కోరిక తీరబోతోందన్న బాలయ్య
  • గతంలో బాలయ్య దర్శకత్వంలో మధ్యలోనే ఆగిపోయిన నర్తనశాల
నందమూరి బాలకృష్ణ స్వీయదర్శకత్వంలో అప్పట్లో 'నర్తనశాల' అనే చిత్రం ప్రారంభమై మధ్యలోనే ఆగిపోయింది. ఆ సినిమాలో ద్రౌపది పాత్రధారిణి ప్రముఖ హీరోయిన్ సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. దాంతో ఆ సినిమాను బాలయ్య పక్కన పెట్టేశారు. అయితే, రాబోయే విజయదశమి సందర్భంగా అభిమానులకు ఈ నందమూరి నట దిగ్గజం కానుక ఇవ్వదలిచారు. తాను దర్శకత్వం వహించిన 'నర్తనశాల' చిత్రంలోని 17 నిమిషాల నిడివి ఉన్న కొన్ని సన్నివేశాలను రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

శ్రేయాస్ ఈటీ ఓటీటీ ప్లాట్ ఫామ్ పై ఎన్బీకే థియేటర్ లో ఈ సీన్లు విడుదల చేయనున్నట్టు బాలకృష్ణ ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. ఇందులో తాను అర్జునుడిగా నటించానని, ద్రౌపది పాత్ర సౌందర్య పోషించారని తెలిపారు. ధర్మరాజుగా శరత్ బాబు, భీముడిగా శ్రీహరి నటించారని వివరించారు.

ఎన్నాళ్ల నుంచో 'నర్తనశాల' సన్నివేశాలు చూడాలనుకుంటున్న అభిమానుల కోరిక ఈ నెల 24న తీరబోతోందని పేర్కొన్నారు. ఈ చిత్రం ద్వారా వసూలైన నిధుల్లో కొంతభాగం సేవా కార్యక్రమాలకు అందిస్తామని తెలిపారు. నాన్నగారి చిత్రాల్లో తనకు అత్యంత ఇష్టమైన చిత్రం 'నర్తనశాల' అని పేర్కొన్నారు.


More Telugu News