జయలలిత మృతిపై దర్యాప్తు జరిపిస్తాం: స్టాలిన్

  • అన్నాడీఎంకే ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తోంది
  • పన్నీర్ సెల్వం నిందితుడని ఆరోగ్యమంత్రి ఆరోపించారు
  • ఆయన విచారణకు కూడా హాజరుకాలేదు
డీఎంకే అధినేత స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. జయ మృతి వెనుక ఉన్న కుట్రను ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. జయ మృతిపై విచారణ జరుపుతున్న రిటైర్డ్ జడ్జి ఆరుముగసామి కమిటీ చేసిన ఆరోపణలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని అన్నారు. కమిటీ సక్రమంగా పని చేయకుండా ముఖ్యమంత్రి పళని స్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అడ్డుకుంటున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. జయ మృతి వెనుక కుట్రను వెలికి తీసేందుకు అన్నాడీఎంకే పాలకులు యత్నించడం లేదని... కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.

జయ మృతి వెనుక దాగి ఉన్న నిజాలను వెలికి తీసేందుకు ధర్మయుద్ధం చేస్తానని ప్రగల్బాలు పలికిన పన్నీర్ సెల్వం ఎందుకు మౌనంగా ఉంటున్నారని స్టాలిన్ ప్రశ్నించారు. జయ మృతి కేసులో ప్రధాన నిందితుడు పన్నీర్ సెల్వం అని ఆరోగ్యమంత్రి విజయభాస్కర్ ఆరోపించారన్న విషయాన్ని స్టాలిన్ గుర్తు చేశారు. విచారణకు హాజరు కావాలని 2018 డిసెంబర్ లో పన్నీర్ సెల్వంకు కమిటీ సమన్లు పంపినా ఆయన పట్టించుకోలేదని చెప్పారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన వెంటనే సమగ్ర విచారణ జరిపి, జయ మృతి వెనుక ఉన్న కుట్రను బహిర్గతం చేస్తామని అన్నారు.


More Telugu News