పనిచేస్తున్న కంపెనీకే టోకరా... ఒక్కడే రెండు జీతాలు అందుకున్నాడు!

  • వేర్వేరు కాంట్రాక్టర్ల ద్వారా రెండు ఉద్యోగాల్లో చేరిక
  • ఏడాదిపాటు రెండు జీతాలు అందుకున్న వైనం
  • ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థతో దొరికిపోయిన మోసగాడు
ఒక్క ఉద్యోగం సంపాదించడమే కష్టమని భావిస్తున్న రోజుల్లో ఓ దురాశాపరుడు ఒకే కంపెనీలో రెండు ఉద్యోగాల్లో చేరి రెండు జీతాలు అందుకుంటూ మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రామ్ కుమార్ దాస్ అనే పాతికేళ్ల యువకుడు గ్రేటర్ నోయిడాలోని మిందా కార్పొరేషన్స్ లిమిటెడ్ అనే సంస్థలో రెండేళ్ల కిందట ఉద్యోగిగా చేరాడు. మరో జాబ్ కాంట్రాక్టర్ ద్వారా గత సంవత్సరం జూన్ లో అదే కంపెనీలో ఇంకో ఉద్యోగంలో చేరాడు.

ఇద్దరు జాబ్ కాంట్రాక్టర్ల నుంచి ఐడీ కార్డులు తీసుకున్న రామ్ కుమార్ దాస్ వేర్వేరు బయోమెట్రిక్ యంత్రాల్లో హాజరు వేయించుకునేవాడు. ఏడాది పాటు ఈ తంతు నిరాటంకంగా సాగింది. రెండు ఉద్యోగాలకు జీతాలు అందుకుంటూ బాగానే ఎంజాయ్ చేశాడు. అయితే మిందా కార్పొరేషన్స్ లిమిటెడ్ ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ హాజరు వ్యవస్థ ఏర్పాటు చేయడంతో రామ్ కుమార్ దాస్ బండారం బట్టబయలైంది.

సంస్థకు చెందిన ఓ ఆఫీసుకు వెళ్లి హాజరు వేయించుకునే క్రమంలో ఫేస్ డిటెక్టర్ అతడిని వెంటనే పట్టేసింది. కంపెనీ డేటాబేస్ లో అప్పటికే అతడి ఫొటో ఉండడంతో పన్నాగం పారలేదు. జరిగిన మోసాన్ని గుర్తించిన కంపెనీ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న గ్రేటర్ నోయిడాలోని ఎకోటెక్ పోలీసులు దర్యాప్తు షురూ చేశారు.


More Telugu News