గుప్త నిధుల కోసం ప్రకాశం జిల్లాలో ఆలయ కలశం ధ్వంసం!

  • శతాబ్దాల చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయం
  • కలశానికి పూజలు చేసి మరీ ధ్వంసం
  • నిధుల కోసమేనన్న జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్
ప్రకాశం జిల్లా తర్లుపాడులో ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన పురాతన శ్రీ వీరభద్రస్వామి ఆలయ కలశాన్ని గుప్త నిధుల కోసం ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది. శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ జరిగిన ఘటనపై స్పందిస్తూ, స్థానిక సీఐలు ఆలయాన్ని సందర్శించారని తెలిపారు. ఆలయ గోపురంపై ఉన్న కలశానికి పసుపు, కుంకుమలతో పూజలు చేసి మరీ, చుట్టూ ఉన్న కాంక్రీట్ ను పగలగొట్టి, కలశాన్ని తొలగించారని ఆయన స్పష్టం చేశారు.

గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డారని, ఆలయ కలశాన్ని ప్రతిష్ఠించిన వేళ, అక్కడేమైనా నిధిని దాచివుంచవచ్చని భావించిన దుండగులు ఈ పనికి పాల్పడ్డారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్టు తెలిపారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

కాగా, తర్లుపాడులో ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఏటా జరిగే ప్రత్యేక ఉత్సవాలకు కర్నూలు, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ప్రజలు వస్తుంటారు. ఆలయ కలశం ధ్వంసమైందన్న విషయాన్ని తెలుసుకున్న స్థానిక బీజేపీ నేతలు ధర్నాకు దిగిన వేళ, స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారుల నుంచి హామీ లభించిన తరువాత, పరిస్థితి సద్దుమణిగింది. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ లోని పలు ఆలయాల్లో అవాంఛనీయ ఘటనలు జరుగుతున్న సంగతి విదితమే.


More Telugu News