మళ్లీ పొంగిన మూసీ, నీట మునిగిన పలు కాలనీలు.. భయంభయంగా బస్తీవాసులు

  • నిన్న సాయంత్రం ఒక్కసారిగా కురిసిన కుండపోత వాన
  • విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి
  • బాట సింగారం, మజీద్‌పుర మధ్యనున్న వాగు పొంగి ఇద్దరు గల్లంతు
నిన్న కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ మరోమారు అతలాకుతలమైంది. మధ్యాహ్నం వరకు ఎండకాయడంతో ఊపిరిపీల్చుకున్న ప్రజలను సాయంత్రమయ్యేసరికి వరుణుడు భయపెట్టాడు. వాతావరణం ఉన్నట్టుండి మారిపోయి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఏకధాటిగా కురిసిన కుండపోత వాన వల్ల నగర వాసులు మళ్లీ భయపడ్డారు. వరద నీటితో పలు కాలనీలు, బస్తీలు నిండిపోయాయి. రోడ్లన్నీ జలమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

వనస్థలిపురం, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్, పంజాగుట్ట, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, హైటెక్ సిటీ, మెహదీపట్నం, అత్తాపూర్, ఆరాంఘర్ చౌరస్తా, చాంద్రాయణగుట్ట ప్రాంతాలు చెరువులను తలపించాయి. రోడ్లపైకి నడుములోతు నీరు చేరడంతో వాహనాల రాకపోకలు స్తంభించి పోయాయి.

బండ్లగూడలో వర్షం మొదలైన మూడు గంటల్లోనే 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ఘట్‌కేసర్‌లో అత్యధికంగా 18.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మలక్‌పేట యశోద ఆసుపత్రి సమీపంలో ఒకరు, అరుంధతి నగర్‌లో మరొకరు విద్యుదాఘాతంతో మృతి చెందగా, బాట సింగారం, మజీద్‌పుర మధ్యనున్న వాగు పొంగిపొర్లడంతో ఇద్దరు వ్యక్తులు కారులో కొట్టుకుపోయారు. హిమాయత్‌సాగర్ గేట్లు తెరవడంతో మూసి నదీ మళ్లీ ఉగ్రరూపం దాల్చింది.


More Telugu News