రాష్ట్రాన్ని ఆదుకోవాలంటూ.. అమిత్ షాకు లేఖ రాసిన జగన్

  • వరదలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది
  • రూ. 4,450 కోట్ల నష్టం జరిగింది
  • తక్షణ సాయంగా రూ. 1,000 కోట్లు ఇవ్వండి
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. భారీ వర్షాలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని... రూ. 4,450 కోట్ల మేర ఆస్తినష్టం జరిగిందని లేఖలో తెలిపారు. బాధితులను ఆదుకునేందుకు, నష్ట నివారణ చర్యలకు తక్షణ సాయంగా రూ. 1,000 కోట్లను ఇవ్వాలని కోరారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపించాలని పేర్కొన్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు భారీ వర్షాలు కురిశాయని లేఖలో జగన్ తెలిపారు. ఎగువనున్న తెలంగాణ, మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురవడంతో కృష్ణా నదికి వరద పోటెత్తిందని చెప్పారు. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైందని అన్నారు. పలు చెరువులు, కాల్వలకు గండ్లు పడ్డాయని, రహదారులు ధ్వంసమయ్యాయని తెలిపారు. చేతికొచ్చే దశలో ఉన్న వరి, మొక్కజొన్న, పత్తి, చెరకు, బొప్పాయి, అరటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. కూరగాయల తోటలు నాశనమయ్యాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి అండగా నిలబడాలని కోరారు.


More Telugu News