3 బంతుల్లో 5 రన్స్ కావాల్సిన దశలో... సిక్స్ తో మ్యాచ్ ఫినిష్ చేసిన డివిలియర్స్

  • రాజస్థాన్ పై బెంగళూరు ఘనవిజయం
  • 22 బంతుల్లో 55 పరుగులు చేసిన డివిలియర్స్
  • 6 సిక్సులు బాదిన మిస్టర్ 360
మిస్టర్ 360గా పేరుగాంచిన విధ్వంసక బ్యాట్స్ మన్ ఏబీ డివిలియర్స్ మరోమారు తన ట్రేడ్ మార్కు ఇన్నింగ్స్ ఆడాడు. కీలకదశలో విజృంభించి ఆడిన ఈ సఫారీ స్టార్ చివర్లో సిక్స్ తో మ్యాచ్ ముగించాడు. దుబాయ్ లో రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో రాయల్ చాలెంజెర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో నెగ్గిందంటే అందులో డివిలియర్స్ పాత్ర కీలకం.

ఆఖర్లో 3 బంతుల్లో 5 పరుగులు కావాల్సిన దశలో జోఫ్రా ఆర్చర్ వేసిన బంతిని డివిలియర్స్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టి బెంగళూరు విజయాన్ని ఖాయం చేశాడు. అంతకుముందు ఉనద్కట్ వేసిన ఓ ఓవర్లో డివిలియర్స్ 3 సిక్స్ లు బాదడంతో మ్యాచ్ బెంగళూరు వైపు మొగ్గింది. మొత్తమ్మీద 22 బంతులాడిన ఈ దక్షిణాఫ్రికా మెరుపువీరుడు 1 ఫోర్, 6 సిక్సులతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

దేవదత్ పడిక్కల్ (35), కెప్టెన్ కోహ్లీ (43) ఇన్నింగ్స్ ను సరైన దిశలో నడిపించగా, ఏబీ తన సీనియారిటీని చాటుకుంటూ రాజస్థాన్ బౌలర్లను ఉతికారేశాడు. అంతకుముందు, టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది.

ఐపీఎల్ రెండో మ్యాచ్... టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్

కాగా, ఇవాళ ఐపీఎల్ లో జరిగే రెండో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య షార్జా క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ జట్టు ఎలాంటి మార్పుల్లేకుండా బరిలో దిగుతోంది. గత మ్యాచ్ లో భుజం గాయానికి గురైన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కోలుకుని ఈ మ్యాచ్ లో ఆడనుండడం ఢిల్లీ శిబిరానికి ఊరట కలిగిస్తోంది. ఇక చెన్నై జట్టులో వరుసగా విఫలమవుతున్న కేదార్ జాదవ్ కు మరో అవకాశం ఇస్తున్నారు.


More Telugu News