ఐపీఎల్ 2020: ముంబయిపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్ కతా నైట్ రైడర్స్

  • అబుదాబిలో నేడు ముంబయి వర్సెస్ కోల్ కతా
  • కోల్ కతా కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన ఇయాన్ మోర్గాన్
  • ఇరు జట్లలోనూ మ్యాచ్ విన్నర్లు!
ఐపీఎల్ లో నేడు రెండు బలమైన జట్ల మధ్య సమరం జరగనుంది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ముంబయి ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ ఆసక్తికర పోరుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా బ్యాటింగ్ ఎంచుకుంది. దినేశ్ కార్తీక్ స్థానంలో కోల్ కతా కొత్త కెప్టెన్ గా నియమితుడైన ఇయాన్ మోర్గాన్ టాస్ గెలిచి మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గు చూపాడు.

ఇరు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లు ఉండడంతో పోరు హోరాహోరీగా సాగడం ఖాయమనిపిస్తోంది. ముంబయి జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, పొలార్డ్, పాండ్య బ్రదర్స్ అందరూ భారీస్కోర్లు సాధించగల సత్తా ఉన్నవారే. ఈ మ్యాచ్ కోసం ముంబయి జట్టులో ఓ మార్పు చేశారు. పేసర్ జేమ్స్ ప్యాటిన్సన్ స్థానంలో ఆస్ట్రేలియాకే చెందిన నాథన్ కౌల్టర్ నైల్ తుదిజట్టులోకి వచ్చాడు.

ఇక కోల్ కతా నైట్ రైడర్స్ లోనూ హిట్టర్లకు కొదవలేదు. రాహుల్ త్రిపాఠి, శుభ్ మాన్ గిల్, నితీశ్ రాణా, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్, దినేశ్ కార్తీక్ మ్యాచ్ ను మలుపు తిప్పగల సమర్థులు. కోల్ కతా జట్టులో యువ పేసర్ నాగర్ కోటి స్థానంలో శివం మావి... ఓపెనర్ బాంటన్ స్థానంలో ఆల్ రౌండర్ క్రిస్ గ్రీన్ కు స్థానం కల్పించారు.


More Telugu News