రెమ్ డెసివిర్ తో ఏమాత్రం ప్రయోజనం లేదు: డబ్ల్యూహెచ్ఓ

  • కరోనా చికిత్సలో ప్రభావం చూపడంలేదన్న డబ్ల్యూహెచ్ఓ
  • డబ్ల్యూహెచ్ఓ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడి
  • 30 దేశాల్లో 11,266 రోగులపై పరిశీలన
కరోనా వైరస్ చికిత్సలో ఇటీవల కాలంలో అత్యధికంగా వినియోగిస్తున్న ఔషధం రెమ్ డెసివిర్. కరోనా లక్షణాలు మధ్యస్థంగా ఉన్నవారిలో ఆ లక్షణాలు మరింత తీవ్రం కాకుండా వైద్యులు యాంటీ వైరల్ డ్రగ్ రెమ్ డెసివిర్ వాడుతున్నారు. కరోనా చికిత్సలో ఇదే ప్రాణాధారమైన మందు అని ప్రచారం జరగడంతో రూ.5,400కి లభ్యమయ్యే ఇంజక్షన్ వైల్ కాస్తా, బ్లాకులో రూ.30 వేల వరకు ధర పలికిన సందర్భాలున్నాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కరోనా సోకిన సమయంలోనూ ఈ ఔషధాన్ని వినియోగించారు.

అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) రెమ్ డెసివిర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. కరోనా చికిత్సలో ముఖ్య ఔషధంగా ఉపయోగిస్తున్న రెమ్ డెసివిర్ తో అనుకున్న మేర ప్రయోజనాలేవీ కనిపించడంలేదని స్పష్టం చేసింది. కరోనా రోగులు కోలుకోవడం, వారిని ప్రాణాపాయం నుంచి బయటపడేయడం వంటి అంశాలపై రెమ్ డెసివిర్ ఏమాత్రం ప్రభావం చూపడంలేదని వివరించింది.

దీనిపై డబ్ల్యూహెచ్ఓ ఓ అధ్యయనం చేపట్టింది. 30 దేశాల్లోని 11,266 మంది రోగులకు అందించిన 28 రోజుల చికిత్సను పరిశీలించింది. రెమ్ డెసివిర్ ను హైడ్రాక్సీ క్లోరోక్విన్, లోపినావిర్, రిటోనావిర్, ఇంటర్ఫెరోన్ వంటి ఔషధాలతో కలిపి ఇచ్చినప్పుడు వాటి ప్రభావం స్వల్పంగానూ, కొన్ని సమయాల్లో అసలేమీ లేకుండానూ ఉన్నట్టు గుర్తించారు.

కాగా, రెమ్ డెసివిర్ కరోనా చికిత్సలో ప్రాణాధార ఔషధం అని ఇప్పటికీ భావిస్తున్న తరుణంలో డబ్ల్యూహెచ్ఓ అధ్యయనం తెరపైకి వచ్చింది. భారత్ సహా దాదాపు 50 దేశాల్లో రెమ్ డెసివిర్ వాడకానికి అనుమతులు ఉన్నాయి.


More Telugu News