తాజ్‌మహల్‌పై కమ్ముకుంటున్న ధూళి మేఘాలు.. మసకబారుతున్న అందాలు!

  • అన్‌లాక్ తర్వాత ఊపందుకున్న నిర్మాణ రంగం
  • తాజ్‌ కట్టడంపై ప్రమాదకర వాయువులు, ధూళి మేఘాలు
  • శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు
ప్రపంచంలోని అద్భుత కట్టడాల్లో ఒకటైన తాజ్‌మహల్ అందాలు మసకబారుతున్నాయి. కరోనా అన్‌లాక్ తర్వాత తాజ్‌మహల్ సమీపంలో నిర్మాణాలు తిరిగి పెద్ద ఎత్తున ప్రారంభం కావడంతో తాజ్‌మహల్‌పై దుమ్ము, ధూళితో కూడిన మేఘాలు అలముకున్నాయి. అలాగే, ప్రమాదకర వాయువులు కూడా చేరడంతో కట్టడానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేశంలోని అత్యంత కాలుష్య కారక నగరాల్లో ఆగ్రా 9వ స్థానంలో ఉంది. లాక్‌డౌన్ సమయంలో కొంత నెమ్మదించిన కాలుష్యం తిరిగి పెరగడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్యం కారణంగా తాము శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్నట్టు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, దుమ్ము, ధూళి కట్టడాన్ని ప్రమాదంలో పడేస్తోందని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి కాలుష్యకారకాలపై ఉక్కుపాదం మోపాలని, ప్రజల ఆరోగ్యంతోపాటు, తాజ్‌మహల్‌ను కాపాడాలని కోరుతున్నారు.


More Telugu News