భారతీయ వంటకాలపై మనసు పారేసుకున్న తైవాన్ అధ్యక్షురాలు!

  • ఇండియన్ ఫుడ్ కు ఫిదా అయిన త్సాయ్ ఇంగ్ వెన్
  • చనా మసాలా, నాన్ అంటే ఇష్టమన్న అధ్యక్షురాలు
  • తైవాన్ ప్రజలకు కూడా ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టమని వెల్లడి
భారతీయ వంటకాలంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. అనేకమంది ప్రముఖులు భారత పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడి ఆహార పదార్థాల రుచికి ఫిదా అవడం తెలిసిందే. తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్ వెన్ కూడా ఇండియన్ ఫుడ్ పై మనసు పారేసుకున్నారు. భారతీయ వంటకాలు ఎంతో బాగుంటాయని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తైవాన్ ప్రజలు కూడా భారతీయ వంటకాలను అమితంగా ఇష్టపడతారని ఆమె పేర్కొన్నారు.

అంతేకాదు, తనకెంతో ఇష్టమైన భారతీయ వంటకాల జాబితాను కూడా పంచుకున్నారు. గతంలో తాను భారత్ లో పర్యటించిన క్షణాలను ఆమె గుర్తుచేసుకున్నారు.

" తైవాన్ లో అనేక భారతీయ రెస్టారెంట్లు ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. తైవాన్ ప్రజలకు భారతీయ ఆహారం అంటే చాలా మక్కువ. నాకు ఎక్కువగా చనా మసాలా, నాన్ అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా చాయ్ తాగుతుంటే భారత్ లో పర్యటిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. నిజంగా భారత్ ఎంతో వైవిధ్యం ఉన్న, వర్ణభరిత దేశం. ఇంతకీ మీకిష్టమైన ఆహారం ఏమిటి?" అని నెటిజన్లను ఆమె ప్రశ్నించారు.


More Telugu News