భారత్ కు చెందిన తొలి ఆస్కార్ అవార్డు గ్రహీత భాను అతైయా కన్నుమూత

  • ముంబయిలోని తన నివాసంలో ఈ ఉదయం మృతి
  • ఎనిమిదేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న అతైయా 
  • 2015 నుంచి నడవలేని స్థితికి చేరిన భాను 
భారత్ కు చెందిన తొలి ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ భాను అతైయా కన్నుమూశారు. ఆమె వయసు 91 సంవత్సరాలు. 1982లో వచ్చిన 'గాంధీ' చిత్రానికి గాను ఆమె బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు. భాను చాన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబయిలోని కొలాబాలో తన నివాసంలో ఆమె ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె రాధిక వెల్లడించారు.

తన తల్లి భాను గత ఎనిమిదేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నారని, అయితే శస్త్రచికిత్సకు ఆమె నిరాకరించిందని రాధిక వివరించారు. 2015 నుంచి నడవలేని స్థితికి చేరుకున్నారని చెప్పారు. నేటి ఉదయం నిద్రలోనే చనిపోయినట్టు తెలిపారు. భాను అంత్యక్రియలు ముంబయి చందన్ వాడి శ్మశానవాటికలో ఈ మధ్యాహ్నం జరిగాయి.


More Telugu News