మంచం మీద నిద్రపోతున్న అమ్మాయి మార్చురీకి వచ్చి చేరింది... ఇంకెంతకాలం ఈ అఘాయిత్యాలు?: వాసిరెడ్డి పద్మ

  • విజయవాడలో దివ్య తేజస్విని అనే యువతి హత్య
  • ఘటనను తీవ్రంగా ఖండించిన వాసిరెడ్డి పద్మ
  • దిశ చట్టాన్ని కేంద్రం వెంటనే ఆమోదించాలని విజ్ఞప్తి
  • దిశ చట్టంతో ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట పడుతుందని వ్యాఖ్యలు
విజయవాడలో దివ్య తేజస్విని అనే యువతిని నాగేంద్రబాబు అనే ప్రేమోన్మాది దారుణంగా అంతమొందించడం పట్ల ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంట్లోకి చొరబడి నిద్రపోతున్న అమ్మాయిపై దాడి చేయడం దారుణమని, గొంతుకోసి చంపడం అమానుషమని పేర్కొన్నారు. ఇంట్లో మంచం మీద నిద్రపోతున్న పిల్ల మార్చురీకి వచ్చి చేరిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమ పేరుతో ఇలాంటి దారుణాలకు పాల్పడడం ఏంటని పద్మ మండిపడ్డారు.

నేను ప్రేమిస్తే నాకే దక్కాలి అనే ఉన్మాదం ఇంకెంతకాలం భరించాలని ఆక్రోశించారు. ప్రేమించకపోతే చంపేస్తారా? అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనల్లో నిందితులకు కఠినశిక్షలు పడేలా కేంద్రం దిశ వంటి చట్టాలకు వెంటనే ఆమోదం తెలపాలని వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళలపై ఘాతుకాల కేసులు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నందు వల్ల కూడా ఈ తరహా ఘటనలకు అడ్డుకట్ట పడడంలేదని ఆమె అభిప్రాయపడ్డారు.

ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో అమ్మాయిలను వెంటాడి వేధించి చంపుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయిలు చదువుకోవడానికో, ఉద్యోగాలు చేయడానికో బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇలాంటి ఘటనలు పెరిగిపోతుంటే, మన చట్టాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. ఇలాంటి దారుణాలు జరగడం ఎంతో నీచం అని ప్రతి ఒక్కరూ భావించే పరిస్థితి రావాలని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.


More Telugu News