50 లక్షల ఎకరాల్లో వరి, 15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు వేయండి: సీఎం కేసీఆర్

  • యాసంగి పంటపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్
  • ప్రభుత్వం సూచించిన విధంగా పంటలు వేయాలన్న సీఎం
  • విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయని ప్రకటన
ఈ యాసంగిలో పంటల విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. యాసంగిలో అమలు చేయాల్సిన సాగు విధానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. 2020-21 యాసంగి సీజన్ లో 50 లక్షల ఎకరాల్లో వరి పంట, మరో 15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలను సాగుచేయాలని ఈ సందర్భంగా రైతులకు కేసీఆర్ సూచించారు. జిల్లాలు, మండలాలు, క్లస్టర్ల వారిగా ఏ పంట వేయాలనే విషయంలో స్థానిక రైతులకు అధికారులు సూచించాలని చెప్పారు. ప్రస్తుత వర్షాకాల సీజన్ లో ప్రభుత్వం సూచించిన విధంగానే రైతులు పంటలు సాగు చేశారని... యాసంగిలో కూడా ఇదే ఒరవడిని రైతులు కొనసాగించాలని అన్నారు.

శనగను నాలుగున్నర లక్షల ఎకరాల్లో, వేరుశనగను 4 లక్షల ఎకరాల్లో, మిరప ఇతర కూరగాయలను లక్షన్నర నుంచి రెండు లక్షల ఎకరాల్లో, జొన్న పంటను లక్ష ఎకరాల్లో, నువ్వులను లక్ష ఎకరాల్లో, పెసర్లను 50 నుంచి 60 వేల ఎకరాల్లో, మినుములను 50 వేల ఎకరాల్లో, పొద్దు తిరుగుడుని 30 నుంచి 40 వేల ఎకరాల్లో, ఆవాలు, కుసుములు, సజ్జలు వంటి పంటలను 60 నుంచి 70 వేల ఎకరాల్లో సాగు చేయాలని సమీక్ష సందర్భంగా ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని పంటలకు సంబంధించి విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వం సూచించిన పంటలను సాగుచేసి రైతులు మంచి ఆదాయం పొందాలని అన్నారు.


More Telugu News