ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన బాల్ వేసిన నోర్జె

  • 156 కిమీ వేగంతో బంతి విసిరిన సఫారీ పేసర్
  • ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న నోర్జె
  • డేల్ స్టెయిన్ రికార్డు తెరమరుగు
టీ20 క్రికెట్ వినోదానికి అడ్డాగా పేరుగాంచిన ఐపీఎల్ లో సరికొత్త రికార్డు నమోదైంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన బంతిని విసరడం ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ ఎన్రిచ్ నోర్జె (26) రికార్డు పుటల్లోకి ఎక్కాడు. గతరాత్రి ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆన్రిచ్ నోర్జె విసిరిన ఓ బంతి వేగం గంటకు 156.22 కిలోమీటర్లుగా నమోదైంది.

అయితే, అంతవేగంగా బంతి వేసినా, బ్యాట్స్ మన్ జోస్ బట్లర్ దాన్ని స్కూప్ షాట్ తో బౌండరీగా మలిచాడు. ఆ తర్వాత బంతిని నోర్జె గంటకు 155.21 కిలోమీటర్ల వేగంతో సంధించగా, ఈసారి జోస్ బట్లర్ బౌల్డయ్యాడు. మొత్తమ్మీద రెండు వరుస బంతులను 150 కిమీ పైచిలుకు వేగంతో విసరడం ద్వారా ఈ దక్షిణాఫ్రికా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు ఐపీఎల్ లో ఫాస్టెస్ బాల్ వేసిన రికార్డు దక్షిణాఫ్రికాకే చెందిన డేల్ స్టెయిన్ పేరిట ఉంది. 2012 సీజన్ లో స్టెయిన్ వేసిన ఓ బంతి గంటకు 154.40 కిమీ వేగంతో దూసుకెళ్లింది.

కాగా, నిన్నటి మ్యాచ్ లో తాను అత్యంత వేగవంతమైన బంతి విసిరిన సంగతి నోర్జెకు మ్యాచ్ అయిపోయే వరకు తెలియదట. గతేడాది అంతర్జాతీయ క్రికెట్ లోకి ప్రవేశించిన ఈ సఫారీ స్పీడ్ స్టర్ ఇప్పటివరకు  6 టెస్టులాడి 19 వికెట్లు సాధించాడు. 7 వన్డేల్లో 14 వికెట్లు, 3 టీ20 అంతర్జాతీయ పోటీల్లో 2 వికెట్లు పడగొట్టాడు.


More Telugu News