మళ్లీ ఓడిన రాజస్థాన్.. టాప్ ప్లేస్‌లో ఢిల్లీ

  • 13 పరుగుల తేడాతో విజయం సాధించిన ఢిల్లీ
  • కీలక సమయాల్లో వికెట్లు పారేసుకున్న రాజస్థాన్
  • మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అన్రిక్
రాజస్థాన్‌ రాయల్స్‌తో గతరాత్రి జరిగిన ఐపీఎల్ 30వ మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఢిల్లీ 12 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత  బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.

అసాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ 8 వికెట్లు కోల్పోయి 148కే చతికిలపడి ఓటమి పాలైంది. తొలుత లక్ష్యం దిశగా దూసుకెళ్తున్నట్టు కనిపించినప్పటికీ కీలక సమయాల్లో వికెట్లు పారేసుకోవడంతో ఓటమిని కొనితెచ్చుకుంది. మరోవైపు, ఢిల్లీ బౌలర్లు తుషార్ దేశ్‌పాండే, అన్రిక్‌, రవిచంద్రన్ అశ్విన్‌లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు.

బెన్‌స్టోక్స్ (41), రాబిన్ ఉతప్ప (32), జోస్ బట్లర్ (22), సంజు శాంసన్ (25) మాత్రమే కాస్త ఫరవాలేదనిపించారు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (1) మరోమారు తీవ్రంగా నిరాశ పరిచాడు. రియాన్ పరాగ్ 1, రాహుల్ తెవాటియా 14, నాటౌట్, జోఫ్రో అర్చర్ 1, శ్రేయాస్ గోపాల్ ఆరు పరుగులు చేశారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ తొలి బంతికే ఓపెనర్ పృథ్వీషా వికెట్‌ను కోల్పోయింది. రహానే మరోమారు నిరాశ పరచగా ధవన్ మెరుపులు మెరిపించాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా బ్యాట్ ఝళిపించాడు. 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. స్టోయినిస్ 18, అలెక్స్ కేరీ 14 పరుగులు చేశారు. కీలక సమయంలో వికెట్లు తీసిన ఢిల్లీ బౌలర్ అన్రిక్ నోర్ట్‌జేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.


More Telugu News