మరి కాసేపట్లో తీరం దాటనున్న వాయుగుండం.. పెను గాలులతో కుంభవృష్టి

  • విశాఖపట్టణం, నర్సాపూర్ మధ్య తీరం దాటే అవకాశం
  • ఆ వెంటనే మరో అల్పపీడనం
  • వర్షాల కారణంగా తెలంగాణలో భారీగా తగ్గిన కరెంటు వినియోగం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరికాసేపట్లో విశాఖపట్టణం, నర్సాపూర్ మధ్య కాకినాడకు దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయుగుండం తీరం దాటే సమయంలో కొన్ని చోట్ల పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాయుగుండం తీరం దాటిన తర్వాత మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అయితే, దాని ప్రభావం ఇప్పుడే తెలియదన్నారు.

వాయుగుండం కారణంగా తెలంగాణలో పలు చోట్ల నిన్నంతా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వనపర్తిలో అత్యధికంగా 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, జగిత్యాల జిల్లా మన్నెగూడెంలో అత్యల్పంగా 5.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా వాతావరణం చల్లబడడంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

నిన్న రాత్రి 8 గంటల సమయానికి రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 5,862 మెగావాట్లు ఉండగా, గతేడాది ఇదే సమయానికి 7,005 మెగావాట్లుగా ఉన్నట్టు పేర్కొన్నారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా నేడు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది.


More Telugu News