ఖుష్బూ వెళ్లిపోవడంతో మాకొచ్చిన నష్టమేమీ లేదు, ఆమె చేరికతో బీజేపీకి ప్రయోజనమూ ఉండదు: కాంగ్రెస్

  • కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఖుష్బూ
  • తమిళ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం ఉండదన్న గుండూరావు
  • ఆమెకు సైద్ధాంతిక నిబద్ధత లేదని విమర్శలు
కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ పట్ల అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న సినీ నటి ఖుష్బూ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ కోసం పనిచేస్తున్న తనలాంటి వారిని ఎదగనివ్వకుండా చేస్తున్నారంటూ ఖుష్బూ తన రాజీనామా లేఖలో సోనియాకు తెలిపారు. ఉదయం రాజీనామా లేఖ పంపిన ఆమె కొన్నిగంటల్లోనే పార్టీ మారారు. దీనిపై తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దినేశ్ గుండూరావు స్పందించారు. ఖుష్బూ వెళ్లిపోవడంతో తమిళనాడులో కాంగ్రెస్ కు ఎలాంటి నష్టం జరగబోదని, ఆమె బీజేపీలో చేరినంత మాత్రాన ఆ పార్టీకి ఎలాంటి ప్రయోజనం లేదని అభిప్రాయపడ్డారు.

తమిళనాడులో బీజేపీపై వ్యతిరేకత ఉందని అన్నారు. ఖుష్బూలో సిద్ధాంతపరమైన నిబద్ధత లేదని విమర్శించారు. ఆమె రాజీనామా తమిళ రాజకీయాల్లో ఏమంత ప్రాధాన్య అంశం కాదని వ్యాఖ్యానించారు. అయినా ఖుష్బూ అలా చేయడం విచారకరమని గుండూరావు పేర్కొన్నారు.

అయితే, ఖుష్బూ బీజేపీలో చేరడాన్ని అధికార అన్నాడీఎంకే స్వాగతించింది. మంత్రి జయకుమార్ మాట్లాడుతూ, తమ మిత్రపక్షమైన బీజేపీలో చేరడం ద్వారా ఖుష్బూ మంచిపని చేశారని, ఇది శుభ పరిణామం అని పేర్కొన్నారు. ఆమెకు అభినందనలు తెలిపారు.


More Telugu News