ఉద్రిక్తతల వేళ సైతం భారత వైద్యుడికి చైనా నివాళి!

  • చైనా, జపాన్ యుద్ధ సమయంలో సైనికులకు సాయం అందించిన డాక్టర్ కోట్నిస్
  • అక్కడే స్థిరపడి 1942లో కన్నుమూత
  • ప్రతి సంవత్సరం ఆయన  జయంతి రోజున నివాళి
చైనా, జపాన్ దేశాల మధ్య 1938లో జరిగిన యుద్ధ సమయంలో చైనా సైనికులకు వైద్య సాయం అందించిన భారతీయ వైద్యుడు డాక్టర్ ద్వారకానాథ్ కోట్నిస్‌కు చైనా ప్రభుత్వం నివాళులర్పించింది. చైనా సైనికులకు సాయం అందించేందుకు భారత్ నుంచి వెళ్లిన ఐదుగురు సభ్యుల వైద్య బృందంలో కోట్నిస్ ఒకరు. యుద్ధం అనంతరం నలుగురు వైద్యులు తిరిగి భారత్ చేరుకోగా, కోట్నిస్ మాత్రం అక్కడే ఉండిపోయారు. 1942లో అక్కడే మరణించారు.

కోట్నిస్ సేవలను గుర్తించిన చైనా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆయన జయంతి రోజున సంస్మరణ సభ నిర్వహిస్తోంది. శనివారం ఆయన 110వ జయంతిని పురస్కరించుకుని నివాళులర్పించింది. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులు డాక్టర్ కోట్నిస్‌పై రూపొందించిన డాక్యుమెంటరీని ఆవిష్కరించారు. భారత్, చైనా దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ సైతం భారతీయ వైద్యుడికి చైనా ప్రభుత్వం నివాళులర్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది.


More Telugu News