సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై సంచలన ఆరోపణలు చేస్తూ సీజేకు లేఖ రాసిన వైఎస్ జగన్!

  • అక్రమ భూ లావాదేవీలలో న్యాయమూర్తి కుమార్తెలు
  • అమరావతి ప్రకటనకు ముందే భూముల కొనుగోలు
  • జడ్జీలపై ఒత్తిడి తెస్తున్న న్యాయమూర్తి 
  • కల్పించుకోవాలని బాబ్డేకు జగన్ లేఖ
సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ గా త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారని ప్రతి ఒక్కరూ భావిస్తున్న, టాప్-2 సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై సంచలన ఆరోపణలు చేస్తూ, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు లేఖ రాశారు. ఏపీ హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులపై ఆయన ఒత్తిడి కూడా తెస్తున్నారని తన లేఖలో జగన్ ఆరోపించారు.

అక్టోబర్ 6వ తేదీతో ఈ లేఖ ఉండగా, శనివారం సాయంత్రం సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లాం, దీన్ని మీడియాకు విడుదల చేశారు. మొత్తం 8 పేజీలున్న లేఖలో, తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడికి అనుకూలంగా ఎన్వీ రమణ ప్రయత్నిస్తున్నారని జగన్ తన లేఖలో పేర్కొన్నారు.

ఎన్వీ రమణ ఇద్దరు కుమార్తెలు అక్రమంగా అమరావతి ప్రాంతంలో భూ లావాదేవీలు చేశారని, వారు కొన్న భూ లావాదేవీలపై ఎన్నో అనుమానాలు, ప్రశ్నలు ఉన్నాయని అన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు వారిద్దరూ భూమిని కొన్నారని అవినీతి నిరోధక శాఖ గుర్తించిందన్నారు.

ఇదిలావుండగా, ఆంధ్రప్రదేశ్ లో మే 2019న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జూన్ 2014 నుంచి మే 2019 వరకూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాలనలో జరిగిన అన్ని లావాదేవీలపై విచారణకు ఆదేశించామని, విచారణ ప్రారంభం కాగానే, రాష్ట్రంలోని న్యాయమూర్తులపై ఎన్వీ రమణ ఒత్తిడి తేవడం మొదలు పెట్టారని తన లేఖలో జగన్ ఆరోపించారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తరువాత కూడా విచారణను హైకోర్టు అడ్డుకుంటోందని తెలుపుతూ, ఉదాహరణగా దమ్మాలపాటి శ్రీనివాస్ భూముల వ్యవహారంపై న్యాయస్థానం స్టే ఇవ్వడాన్ని జగన్ ప్రస్తావించారు.

నేరపూరిత, మోసపు చర్యలపై విచారణలు కూడా నిలిచిపోతున్నాయని, వార్తలు రాయవద్దని మీడియాపైనా ఆంక్షలు విధిస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఇలా స్టేలు ఇస్తూ వెళుతుంటే, విచారణలు ఎక్కడివక్కడ నిలిచిపోతున్నాయని, వెంటనే సీజే కల్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అప్పుడే న్యాయాన్ని పరిరక్షించవచ్చని జగన్ సూచించారు.

కాగా, ఇటీవల మాజీ న్యాయమూర్తి ఆర్ భానుమతి రాసిన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎన్వీ రమణ, ఆపై ప్రసంగిస్తూ, న్యాయమూర్తులను విమర్శించడం పరిపాటిగా మారిందని, సామాజిక మాధ్యమాలు విస్తరించిన తరువాత, జడ్జీలపై ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారని, తమను తాము సమర్ధించుకునే అవకాశం మాత్రం న్యాయమూర్తులకు లేదని అన్నారు.


More Telugu News