రాహుల్, మయాంక్ పోరు వృథా... చివరి వరకు హోరాహోరీ మ్యాచ్ లో పంజాబ్ ఓటమి

  • రెండు పరుగుల తేడాతో పంజాబ్
  • ఓడిపోయే మ్యాచ్ లో విజయం దక్కించుకున్న కోల్ కతా
  • సిక్సర్ కొట్టాల్సిన స్థితిలో ఫోర్ కొట్టిన మ్యాక్స్ వెల్
క్రికెట్ లో ఉన్న మజా మరోమారు ఆవిష్కృతమైంది. కోల్ కతా నైట్ రైడర్స్ తో  చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 165 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ కు ఓపెనర్లు కేఎల్ రాహుల్ (74), మయాంక్ అగర్వాల్ (56) తొలివికెట్ కు 14.2 ఓవర్లలో 115 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఈ పార్ట్ నర్ షిప్ చూస్తే పంజాబ్ ఓడిపోతుందని ఎవరూ అనుకుని ఉండరు.

అయితే, కోల్ కతా బౌలర్ ప్రసిధ్ కృష్ణ ఎంతో ప్రభావవంతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లతో పంజాబ్ ను దెబ్బకొట్టాడు. చివరి ఓవర్ లో 14 పరుగులు అవసరం కాగా, పంజాబ్ జట్టు 12 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఆఖరి బంతికి సిక్స్ కొట్టాల్సిన స్థితిలో నరైన్ వేసిన బంతిని మ్యాక్స్ వెల్ భారీ షాట్ కొట్టినా అది సరిగ్గా బౌండరీ లైన్ ముందు పడడంతో ఫోర్ మాత్రమే వచ్చింది. దాంతో పంజాబ్ శిబిరంలో నిరాశ నెలకొనగా, ఓడిపోయే మ్యాచ్ లో గెలుపును చేజిక్కించుకున్న కోల్ కతా ఆటగాళ్లలో ఆనందం వెల్లివిరిసింది.

కాగా, ఇవాళ్టి రెండో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ పోరు దుబాయ్ లో జరుగుతోంది.


More Telugu News