ప్రధానికి కొత్త విమానం, జవాన్లకు రక్షణలేని ట్రక్కులు!... ఇదేం న్యాయం?: రాహుల్ గాంధీ

  • ఎయిరిండియా వన్ విమానం సమకూర్చుకున్న కేంద్రం
  • వేల కోట్ల ఖర్చుతో విమానం ఎందుకన్న రాహుల్
  • సైనికులకు బులెట్ ప్రూఫ్ వాహనాలు ఇవ్వడంలేదని వ్యాఖ్యలు
ఇటీవలే కేంద్రం ఎయిరిండియా వన్ పేరుతో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రయాణాల కోసం భారీ విమానాన్ని సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు సంధించారు. సాధారణ సైనికులను ఏమాత్రం రక్షణ లేని నాన్ బులెట్ ప్రూఫ్ వాహనాల్లో తరలిస్తున్నారని, ప్రధాని మోదీకి మాత్రం రూ.8,400 కోట్ల విలువైన విమానం కావాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలో రాహుల్ ఓ వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోలో కొందరు జవాన్లు మాట్లాడుకుంటుండడం చూడవచ్చు. అధికారులు బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో వెళుతూ, మనల్ని మాత్రం ట్రక్కుల్లో తీసుకెళుతున్నారు అంటూ ఆ జవాన్లు తమలో తాము చర్చించుకుంటున్న ఆ వీడియోను ట్వీట్ చేసిన రాహుల్... "మన జవాన్లను ఇలాంటి నాన్-బులెట్ ప్రూఫ్ వాహనాల్లో తీసుకెళ్లి అమరుల్ని చేస్తున్నారు. ప్రధానికోసం వేల కోట్లతో విమానం కొనుగోలు చేశారు... ఇదెక్కడి న్యాయం?" అంటూ ప్రశ్నించారు. సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు బులెట్ ప్రూఫ్ వాహనాలు కూడా ఇవ్వడం లేదంటూ రాహుల్ విమర్శించారు.



More Telugu News