అర్ధరాత్రి ఎవర్నో తీసుకువచ్చి మాన్సాస్ ట్రస్టులో కూర్చోబెట్టారు: రఘురామకృష్ణరాజు

  • మహారాజా కాలేజీ ప్రైవేటీకరణ అంశంపై రఘురామ వ్యాఖ్యలు
  • పోరాడాలంటూ పూర్వ విద్యార్థులకు సూచన
  • అన్యాయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లాలంటూ సలహా
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయనగరం మహారాజా కళాశాల ప్రైవేటీకరణ అంశంపై స్పందించారు. విజయనగరం మహారాజా కళాశాల చారిత్రక నేపథ్యం ఉన్న విద్యాసంస్థ అని తెలిపారు. వందేళ్ల కిందట ఎవరైనా చదువుకోవాలని అనుకుంటే విశాఖలోనూ విద్యాసదుపాయాలు లేని రోజుల్లో విజయనగరం మహారాజా కళాశాల ప్రముఖ విద్యాకేంద్రంగా భాసిల్లిందని తెలిపారు.

ఈ కాలేజి 1971లో శత వసంతోత్సవం జరుపుకుందని, వీవీ గిరి వంటి ప్రముఖుడు రాష్ట్రపతి హోదాలో ఆ కళాశాలకు విచ్చేశారని వెల్లడించారు అయితే, ఇప్పటి ప్రభుత్వ హయాంలో ఆ కాలేజిని భ్రష్టు పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ కళాశాల పూర్వ విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారని, అయితే వారు ఇళ్లల్లో కూర్చుని వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలతో సరిపెట్టుకోకుండా, రోడ్లపైకి వచ్చి పోరాడాలని రఘురామకృష్ణరాజు సూచించారు. ఉత్తరాంధ్రలో దాదాపు ప్రతి ఇంటిలో ఒక సభ్యుడైనా ఆ కాలేజిలో చదువుకున్న ఘనచరిత్ర ఉందని, ఆ ప్రాంతంతో మహరాజా కళాశాలకు భావోద్వేగ అనుబంధం ముడిపడి ఉందని తెలిపారు.

అయితే మాన్సాస్ ట్రస్టులో గానీ, మహారాజా కళాశాలలో గానీ దాన్ని అన్ ఎయిడెడ్ చేయాలనో, ప్రైవేటీకరణ చేయాలనో ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. ఇప్పటి పరిస్థితుల్లో ఏదైనా అంశంపై ఆందోళన చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్న భయం కలుగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో కోర్టుల్లో ముఖ్యమైన కేసులనే పరిష్కరిస్తున్నారని, ఇది కూడా ముఖ్యమైన కేసే అని చాటే విధంగా పూర్వ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి కరోనా నిబంధనలు పాటిస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు.

"మీలో మీరు కుమిలిపోతే కుదరదు. మాన్సాస్ ట్రస్ట్ లో పాత ట్రస్టీ ఎవరున్నారో, ఎవరికైతే అర్హత ఉందో వారిని పునరుద్ధరించాలి అంటూ రోడ్డుమీదికి రండి. అంతేతప్ప, ఇది విజయనగరం కళాశాల, సంగీత పాఠశాల అని వాట్సాప్ ల్లో సందేశాలు మానుకోండి. ట్రస్ట్ నియామవళి ప్రకారం ఎవరికైతే అర్హత ఉందో, ఆ నిజాయతీపరుడైన ట్రస్టీని మళ్లీ తీసుకువచ్చేవరకు పోరాడండి.

అర్ధరాత్రి ఎవర్నో తీసుకువచ్చి ట్రస్టులో కూర్చోబెట్టారు. అది చాలా తప్పు. మా ప్రభుత్వం ఆ తప్పును సరిదిద్దుకునే పరిస్థితి కనిపించడంలేదు. తప్పుమీద తప్పు చేస్తున్నారే తప్ప మా ప్రభుత్వానికి తప్పులను సవరించుకునే ఆలోచన లేదు. ఈ పరిస్థితిని మార్చాల్సింది విజయనగరం మహారాజా కళాశాల పూర్వ విద్యార్థులే. మాన్సాస్ ట్రస్టు వ్యవహారాలను, సింహాచలం దేవస్థానంలో జరిగే అన్యాయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలి. న్యాయం తప్పకుండా జరుగుతుంది" అని వ్యాఖ్యానించారు.


More Telugu News