కేంద్ర ప్రభుత్వ నిధులతో కార్యక్రమం నిర్వహిస్తున్నామనేది నిజం కాదు: మంత్రి ఆదిమూలపు సురేశ్

  • జగనన్న విద్యాకానుకను చూసి విపక్షాలు రగిలిపోతున్నాయి
  • ప్రజలు సంతోషంగా ఉండటం వారికి ఇష్టం లేదు
  • జగన్ అంటే స్టిక్కర్ సీఎం కాదు
జగనన్న విద్యాకానుక పథకంపై ప్రతిపక్షం అనవసరంగా బురదచల్లుతోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మండిపడ్డారు. ఒక మంచి కార్యక్రమాన్ని చూసి విపక్ష నేతలకు కడుపు రగిలిపోతోందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిధులతో జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని విమర్శిస్తున్నారని, ప్రజలు సంతోషంగా ఉండటం ప్రతిపక్షానికి ఇష్టం లేదని అన్నారు. జగనన్న విద్యాకానుక పథకం వంటి మంచి పథకం దేశంలో ఎక్కడా లేదని చెప్పారు. ఈ పథకంపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

జగన్ అంటే స్టిక్కర్ సీఎం కాదని... స్ట్రయికింగ్ సీఎం అని సురేశ్ కితాబిచ్చారు. జగనన్న చెప్పాడంటే.. చేస్తాడని ప్రజలందరూ అనుకుంటున్నారని చెప్పారు. విద్యా కానుక కిట్ల పంపిణీలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని... కరోనా నేపథ్యంలో రోజుకు 50 కిట్లకు మించకుండా పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమం వల్ల 43 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. కేవలం పాఠ్యపుస్తకాలకు మాత్రమే కేంద్రం నిధులను సమకూర్చిందని తెలిపారు. స్కూల్ బ్యాగులు, నోట్ బుక్స్, బూట్లు, బెల్టుల ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు.


More Telugu News