బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడి కారును ఢీకొట్టిన లారీ.. హత్యాయత్నమంటూ పోలీసులకు ఫిర్యాదు

  • బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఇటీవలే నియమితులైన అబ్దుల్లా కుట్టీ
  • వెనక నుంచి రెండుసార్లు ఢీకొట్టిన లారీ
  • కుట్ర దాగి ఉందన్న బీజేపీ కేరళ చీఫ్
తనపై హత్యాయత్నం జరిగిందంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఏపీ అబ్దుల్లాకుట్టీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న ఉదయం తిరువనంతపురం నుంచి కన్నూరు వెళ్తుండగా మలప్పురం జిల్లాలోని రందథని వద్ద తన కారును వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టిందని, ఇది ముమ్మాటికి తనను హత్య చేసేందుకు వేసిన పథకమేనని ఆయన ఆరోపించారు. లారీ రెండుసార్లు ఢీకొట్టిందని, దాని డ్రైవర్ మాత్రం నిద్రమత్తులో ఉండడం వల్లే ఇలా జరిగిందని చెప్పాడని, అయితే ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అబ్దుల్లాకుట్టీ తెలిపారు.

అదే జిల్లాలో అదే రోజు మరో ఘటన కూడా జరిగిందని, వెలియంకోడ్‌లో రెస్టారెంట్‌లో ఉండగా కొందరు దుండగులు తన కారుపై రాళ్లు రువ్వారని, ఈ ఘటనపైనా పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఈ రెండు ఘటనలను బీజేపీ కేరళ చీఫ్ కె.సురేంద్రన్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనల వెనక కుట్ర ఉందని ఆరోపించారు. దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. కాగా, అబ్దుల్లా కుట్టీ ఇటీవలే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.


More Telugu News