కోటీశ్వరుడు కావడమే లక్ష్యంగా.. బీహార్ ఎన్నికల బరిలోకి దిగిన టైలర్!

  • బర్బీఘా అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి
  • ఎమ్మెల్యే అయ్యాక అభివృద్ధి నిధులను మాయం చేసి కోటీశ్వరుడిని అవుతానన్న రాజేంద్రప్రసాద్
  • ఎమ్మెల్యేలు అయినవాళ్లంతా లగ్జరీ భవనాల్లో నివసిస్తున్నారన్న అభ్యర్థి
సాధారణంగా ఎవరైనా ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చామని చెబుతారు. కానీ ఈయన మాత్రం తాను కోటీశ్వరుడు కావడానికే రాజకీయాల్లోకి దిగుతున్నట్టు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బీహార్‌లో ఈ నెలలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రముఖ రాజకీయ పార్టీలన్నీ గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో నలందా జిల్లాలోని బర్బీఘా అసెంబ్లీ స్థానం నుంచి టైలర్ (దర్జీ)గా పనిచేస్తున్న రాజేంద్రప్రసాద్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాడు.

నామినేషన్ దాఖలు చేసిన తర్వాత రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తాను కోటీశ్వరుడిని కావడానికే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు చెప్పడం విశేషం. రాజకీయాల్లో అడుగుపెట్టి ఎమ్మెల్యేలు అయిన వారంతా కోటీశ్వరులు అవుతున్నారని, చిన్నప్పటి నుంచి తాను ఈ విషయాన్ని గమనిస్తున్నానని చెప్పాడు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తర్వాత విలాసవంతమైన బంగళాలు నిర్మించుకుంటున్నారని, లగ్జరీ కార్లు కొంటున్నారని అన్నాడు.  

ధనవంతుడిని కావాలన్న కోరికను తాను ఇలా నెరవేర్చుకోవాలని అనుకుంటున్నానని రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చాడు. మరి ఎన్నికయ్యాక కోటీశ్వరుడు కావాలంటే ఏం చేయాలన్న విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ.. అభివృద్ధి కోసం మంజూరయ్యే నిధులను మాయం చేయడం ద్వారా కోటీశ్వరుడిని అవుతానని చెప్పుకొచ్చాడు. కాగా, గ్రామంలో ఓ భూవివాదంతోపాటు అత్యాచార కేసులో రాజేంద్రప్రసాద్ ఆరు నెలలపాటు జైలు శిక్ష కూడా గడపడం గమనార్హం.


More Telugu News