న్యాయవ్యవస్థపై యుద్ధమా?... మీడియాలో ఇవేం కథనాలు?: సజ్జల రామకృష్ణారెడ్డి

  • హైకోర్టులో సర్కారు వ్యతిరేక నిర్ణయాలు
  • వైసీపీ నేతల వ్యాఖ్యలు
  • న్యాయమూర్తుల ఆగ్రహం అంటూ మీడియాలో కథనాలు
ఇటీవల ఏపీ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేక నిర్ణయాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల పట్ల న్యాయ వ్యవస్థ ఆగ్రహం చెందిందంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

"న్యాయవ్యవస్థపై యుద్ధమా? ఏపీలో న్యాయవ్యవస్థను మూసేయాలన్న ఉద్దేశంతో చేసినట్టుంది అని హైకోర్టు న్యాయమూర్తులు అన్నట్టుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి సహా ఓ వర్గం మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి" అని సజ్జల వెల్లడించారు. కావాలంటే తమ తీర్పులపై అప్పీలుకు వెళ్లండని కూడా న్యాయమూర్తులు వ్యాఖ్యానించినట్టుగా ఆ కథనాల్లో పేర్కొన్నారని వివరించారు.

"కాకపోతే ఈ వ్యాఖ్యలు వారిచ్చే తీర్పుల్లో ఉంటే వారు చెప్పినట్టుగానే అప్పీలుకు వెళ్లి అవి చట్టబద్ధమో కాదో తేల్చమని ఎగువకోర్టును కోరడానికి అవకాశం ఉంటుంది. న్యాయమూర్తులు విచారణ సందర్భంలో అన్నట్టుగా చెబుతున్న ఈ మాటలు తీర్పుల్లో లేకపోవడం రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించేవారిని ఆందోళనకు గురిచేస్తోంది. న్యాయప్రక్రియలో ఇలాంటి వ్యాఖ్యలకు చోటు లేనప్పటికీ న్యాయమూర్తులు మౌఖికంగా వ్యాఖ్యలు చేశారంటూ ఆ పత్రికలు ప్రభుత్వ వ్యవస్థల ప్రతిష్ఠలను దెబ్బతీసేలా కథనాలు ప్రచురిస్తున్నాయి. అందుకనే అభిప్రాయాలను మౌఖికంగా కాదు, తీర్పుల ద్వారా చెప్పమని వ్యవస్థలపై గౌరవం ఉన్నవారు చెబుతున్నారు" అంటూ సజ్జల తన అభిప్రాయాలను పంచుకున్నారు.


More Telugu News