దుబ్బాక ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియలో ఆసక్తికర ఘటన.. 'కలియుగ పాండవుల' నామినేషన్‌

  • ఎన్నిక నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం 
  • ఐదుగురు యువకులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ 
  • రవితేజ‌, ధనరాజ్‌, కె.శ్యామ్‌కుమార్‌, మోతె నరేశ్‌, రాధాసాగర్‌ పోటీ 
మెదక్ జిల్లాలోని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి ఇటీవల కన్నుమూసిన నేపథ్యంలో ఆ స్థానంలో ఉప ఎన్నికకు ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నిక నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైంది. అయితే, తొలిరోజే ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

కలియుగ పాండవుల పేరిట ఐదుగురు యువకులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. తొలిరోజు మొత్తం ఆరుగురు నామినేషన్లు దాఖలు చేయగా, వారిలో ఐదుగురు కలియుగ పాండవులే ఉన్నారు. బుర్ర రవితేజ గౌడ్‌, రేవు చిన్న ధనరాజ్‌ కె.శ్యామ్‌కుమార్‌, మోతె నరేశ్‌, మీసాల రాధాసాగర్‌ అనే ఐదుగురు యువకులు నామినేషన్లు సమర్పించారు. కలియుగ పాండవుల్లా తాము పోరాడతామని చెప్పుకొచ్చారు.

తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై తాము పోరాడతామని చెప్పారు. అలాగే, కొవిడ్-19 చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. కాగా, దుబ్బాక ఉప ఎన్నిక వచ్చేనెల 3న జరగనుంది. కాగా, ఈ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాత పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నుంచి ఎం.రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు.


More Telugu News